కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యాన్ని (Dearness Allowance) 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు ఇస్తున్న డియర్ నెస్ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. అదనపు వాయిదాల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ విడుదల జూలై 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడిచారు.
7వ పే కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు గోధుమ మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గోధమ మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 150 పెంచుతున్నట్టు తెలిపింది. 2023-24 కు గాను గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ. 2275గా ప్రకటించింది.
నూనె గింజలతో పాటు ఆవాలకు మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచారు. ముతక ధాన్యాల ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. బార్లీ క్వింటాల్‌కు రూ.115, కందులు క్వింటాల్‌కు రూ.425, మినుములు ధర క్వింటాల్‌కు రూ.105 చొప్పున పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
ఇక గ్రూపు సీ, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. రైల్వేలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల జీతంతో సమానమైన బోనస్ ను అందిస్తామని తెలిపారు. గతంలో లడాఖ్‌లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని 2020లో ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ మేరకు 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రణాళికను రూపొందించిందన్నారు.