రైలు ప్రయాణాలంటే ఇష్టం ఉన్నవాళ్లకి కూడా విరక్తి కలిగే సంఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లో జరిగింది. పాములాడించే వాళ్లు ట్రైన్ లో ఉన్న బోగీలో ఉన్న ప్యాసింజర్లతో ఆడుకున్నారు. తమకు కావల్సినంత డబ్బులు ఇవ్వలేదని వారిపైకి పాములను వదిలారు.దీంతో ఆ పాముల నుంచి తప్పించుకోడానికి ప్రయాణికుల తలప్రాణం తోకకి వచ్చినట్టైంది.
ఈ వింత ఘటన హౌరా, గ్వాలియర్‌ల మధ్య ట్రావెల్ చేస్తున్న చంబల్ ఎక్స్ ప్రెస్(Chambal Express)లో జరిగింది. బందా స్టేషన్(Banda station)లో అందరితో పాటే ఓ నలుగురు పాములు పట్టుకునే వారు రైలు ఎక్కారు. వారు కొంచెం ఆగి రైలు కదలడం మొదలవగానే బుట్టలో నుంచి పాములను బయటకు తీసి ఆడించడం మొదలు పెట్టారు. వాటి ఆటను చూసిన కొంతమంది ప్రయాణీకులు వారికి డబ్బులు ఇచ్చారు.
మరికొంతమంది ఇవ్వలేదు. అయితే వారు వస్తాయనుకున్నన్ని డబ్బులు రాకపోవడంతో పాములు ఆడించేవారికి చిరెత్తుకొచ్చింది. బుట్టలో నుంచి పాములను తీసి బయటకు వదిలారు. ఆ పాములు రైలులో తిరగడం మొదలు పెట్టాయి.
దీంతో జనం ఒక్కసారిగా భయంతో ట్రైన్ లోనే పైన సీట్లలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కొంత మంది టాయిలెట్ లో దాక్కున్నారు. బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు. దాదాపు అరగంట పాటు ఈ తతంగం అంతా కొనసాగింది. చాలా మంది రైల్వే కంట్రోల్ రూం కి ఫోన్ చేసి తమను కాపాడాలని కోరారు.
రైలు ఎక్కిన గంట తరువాత ఆ పాములు ఆడించేవారు మహోబా స్టేషన్ లో దిగి వెళ్లిపోయారు. అయితే ప్రయాణీకులు కూడా అక్కడే దిగి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రైల్వే పోలీసులు వచ్చి బోగీ మొత్తం తనిఖీ చేసి పాములు లేవని నిర్ధారించారు. పాములు ఆడించేవారు వారితో పాటు తీసుకొని వెళ్లవచ్చని చెప్పారు.
అయితే పోలీసులు వచ్చే లోపే వారు జారుకోవడంతో వారిని పట్టుకోలేకపోయారు. ప్రయాణీకులు మాత్రం తమను ఇంతగా భయపెట్టిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకొని కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.