కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ( CUSAT)లో తొక్కిసలాట (Stampede) జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి గాయాలైనట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వర్శిటీ ఆడిటోరియంలో టెక్ ఫెస్ ఏర్పాటు చేశారు. ఈ ఫెస్ట్‌కు సింగర్ నికితా గాంధీ హాజరై తన గాత్రంతో అందరిని అలరించారు.
టెక్ ఫెస్ట్ సందర్బంగా పాసులు ఉన్న వారిని మాత్రమే ఆడిటోరియంలోకి అధికారులు అనుమతించారు. దీంతో ఆడిటోరియం గేటు వద్ద విద్యార్థులు లైన్లలో వేచి ఉన్నారు. ఇంతలో ఒక్క సారిగా వర్షం మొదలైంది. షెల్టర్ కోసం ఆడిటోరియంలోకి వచ్చేందుకు విద్యార్థులు ఒక్క సారిగా దూసుకు వచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నట్టు అధికారులు చెప్పారు.
గాయపడిన వారిని కాలామస్సేరి ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాట నేపథ్యంలో అత్యవసరంగా రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన కోజికోడ్‌లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో సమావేశం జరిగింది. ఘటనపై కేబినెట్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల సంతాపాన్ని ప్రకటించింది. కేరళ సదస్‌లో భాగంగా ఆదివారం నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ అన్నారు. ఘటనలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు మరణించినట్టు తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. వారిలో ఇద్దరు ప్రైవేట్ ఆస్పత్రిలో, మరో ఇద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికత్స అందించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.