యూపీ (UP)లో ప్రజలను తప్పుడు పద్దతుల్లో మత మార్పిడి (Religious conversion) చేసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోన్ భద్ర జిల్లాలో తప్పుడు పద్దతుల్లో మత మార్పిడులకు పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 42 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున మత గ్రంధాలు, ప్రచార వస్తువులు, ల్యాప్ టాప్స్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లాలోని చోపాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్హియా తోలా నివాసి నర్సింహా అనే వ్యక్తి గిరిజనులను, పేదలను ప్రలోభాలకు గురి చేసి మోసపూరిత మార్గాల ద్వారా వారిని మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అదనపు ఎస్పీ కలు సింగ్ తెలిపారు.
ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తం 42 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. అరెస్టైన వారిలో చెన్నైకి చెందిన జైప్రభు, యూపీలోని రాబర్ట్స్‌గంజ్‌కు చెందిన అజయ్‌కుమార్, ఏపీలోని విజయవాడకు చెందిన చెక్కా ఇమ్మాన్యుయేల్ ఉన్నారన్నారు.
వారితో పాటు రాజేంద్ర కోల్, చొటు అలియాస్ రంజన్, పరమానంద్, సోహన్, ప్రేమ్‌నాథ్ ప్రజాపతి, రామ్ ప్రతాప్‌లు ఉన్నట్టు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇటీవల యూపీలో మత మార్పిడిలను నిషేదిస్తూ యోగీ సర్కార్ ఓ ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించింది. దీంతో అక్రమ పద్దతుల్లో మత మార్పిడిలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.