పార్లమెంట్ (Parliament)లో రచ్చ కొనసాగుతోంది. పార్లమెంట్‌లో భద్రతా లోపం (Parliament Security Breach)పై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఈ రోజు కూడా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఓ ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందర గోళం నెలకొంది. దీంతో సభను సభాధిపతులు పలు మార్లు వాయిదా వేశారు.
కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ క్రమంలో ఎంపీల తీరుతో అసహనం చెందిన సభాధిపతి పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎంపీలు శశిథరూర్, సుప్రీయ సూలే, డానిష్ అలీ, మనీష్ తివారీ, ఇతర ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ రోజు మరో 49 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇప్పటి వరకు సస్పెండైన ఎంపీల సంఖ్య 141కి చేరుకుంది.
నిన్న కూడా ఇదే కారణంపై 78 మందిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలంతా బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. సభలో ఎలాంటి చర్చకు అనుమతి ఇవ్వకుండా చట్ట సభను నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య నిబంధనలను నిరంకుశ మోడీ ప్రభుత్వం చెత్తబుట్టలో పడవేస్తోందన్నారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేశారని బీఎస్పీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత మందిని సస్పెండ్ చేయడం చూడలేదన్నారు. పాలక పక్షం చాలా అహంకారపూరితంగా మారిందని ఈ ఘటన ద్వారా తెలుస్తోందన్నారు. వారు అధికారం కోసం దురాశతో ఉన్నారని, అందుకే అన్ని రకాల ఆలోచనలను కోల్పోయారని మండిపడ్డారు.