జమ్ములో ఉగ్ర వేట కొనసాగుతోంది. పాక్ (Pakisthan) నుంచి భారత్ (India)లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఉగ్ర వాదుల (Terrorists) ను భద్రతా దళాలు మట్టు పెట్టాయి. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా సైన్యం వారిని గుర్తించి కాల్పులు జరిపాయి.
కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయినట్టు భద్రతా దళాలు తెలిపాయి. మృతులకు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో సంబంధాలు వున్నట్టు వెల్లడించాయి. కుప్వారాలో ఉగ్రవేట కొనసాగుతోందని సైనికాధికారులు వెల్లడించారు. కుప్వారాలో నియంత్రణ రేఖ దగ్గర ఉగ్ర కదలికలపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సైన్యంతో కలిసి కుప్వారాలో ఆపరేషన్ మొదలు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయన్నారు. ఈ ప్రాంతం నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
నియంత్రణ రేఖ వెంబడి సుమారుగా 16 లాంచింగ్ ప్యాడ్లు తయారు చేసినట్లు అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకు ముందు ఆదివారం పాక్ నుంచి భారత్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హత మార్చింది.