నేపాల్ (Nepal) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ప్రకృతి విలయ తాండవం చేయడంతో 128 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
నేపాల్ లోని వాయువ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. ఖట్మండ్ కు 400 కిలో మీటర్ల దూరంలో బజర్ కోట్ ప్రాంతంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు వెల్లడించారు. రాత్రి సంభవించిన భారీ భూకంపానికి చాలా వరకు ఇళ్లన్నీ నేల మట్టం అయ్యాయి.
పశ్చిమ రుకుం ప్రాంతంలో 36 మంది, జాజర్ కోట్ ప్రాంతంలో 34 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. రాత్రి సమయంలో భూకంపం రావడం, పలు చోట్ల రహదారులు బ్లాక్ కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందన్నారు. ఇది ఇలా వుంటే భూకంప మృతులకు నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దాహల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
భూకంప ప్రాంతంలో సహాయక చర్యల కోసం మూడు సహాయక ఏజెన్సీలను పంపినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతకు ముందు 2015లో నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భూకంపంలో 9000 మంది మృతి చెందగా, 22000 మంది గాయపడ్డారు.