పార్లమెంట్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఒకే రోజు పార్లమెంట్‌లో ఏకంగా 78 మంది ఎంపీ (MP)లు సస్పెన్షన్ (Suspension)కు గురయ్యారు. ఉభయ సభలు ఉదయం ప్రాంరభం కాగానే పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం (Parliament Security Breach)పై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో పెద్ద రచ్చ జరిగింది.
ఈ నేపథ్యంలో పలు మార్లు ఉభయసభలను వాయిదా వేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. సభాధిపతి స్థానం వద్దకు దూసుకు వెళ్లి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సభాధిపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభాకార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని సభ్యులను ఈ సందర్బంగా కోరారు.
కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో లోక్ సభలో 33 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారిలో 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు, పెద్దల సభలో 45 మందిపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేయించారు. వారిలో 34 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
ఇక ఇప్పటికే 14 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సోమవారం సస్పెండ్ అయిన వారితో కలిపితే ఇప్పటివరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 92కు చేరింది. సస్పెన్షన్ కు గురైన వారిలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకంఠన్, బెన్సీ బెహనాన్, కే. సుబ్రహ్మణ్యం, ఎస్. వెంకటేశన్, మహమ్మద్ జావెద్ లు ఉన్నారు.
మరోవైపు, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సస్పెన్షన్ వేటు వేశారు. వారిలో 34 మందిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన 11 మంది ఎంపీల ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.
తనతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ దాస్ తెలిపారు. ఇటీవలే సస్పెండ్ అయిన తమ ఎంపీలపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై హోం మంత్రి వచ్చి ప్రకటన చేయాలన్నారు. హోం మంత్రి ప్రతిరోజు టీవీల ముందు స్టేట్మెంట్స్ ఇస్తారని మండిపడ్డారు. పార్లమెంటులో భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సభలో కూడా చెబితే బాగుంటుందన్నారు.
ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ముందుగా దుండగులు పార్లమెంటుపై దాడి చేశారని అన్నారు. ఆ తర్వాత మోడీ సర్కార్ పార్లమెంట్ సహా ప్రజాస్వామ్యంపై దాడి చేసిందన్నారు. ఇప్పటివరకు మొత్తం 47 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా నిరంకుశ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను చెత్తబుట్టలో వేసిందన్నారు.