Telugu News » Ayodhya: రామ్ లల్లాకు 8 అడుగుల బంగారు సింహాసనం…!

Ayodhya: రామ్ లల్లాకు 8 అడుగుల బంగారు సింహాసనం…!

మొత్తం ఎనిమిది అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పులో సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్టు పేర్కొంది.

by Ramu
8 feet gold throne for ayodhya ram mandir and 100 quintal rice ordered for akshat puja on november 5

అయోధ్య (Ayodhya)లో ‘రామ్ లల్లా’కు భారీ సింహాసనాన్ని (Throne) ఏర్పాటు చేస్తున్నారు. రామాలయ గర్బగుడిలో పాలరాతితో చేసిన సింహాసనానికి బంగారు పూత పూసి నెలకొల్పనున్నారు. మొత్తం ఎనిమిది అడుగుల ఎత్తు నాలుగు అడుగుల వెడల్పులో సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్టు పేర్కొంది. ఈ సింహాసనం డిసెంబర్ 15న అయోధ్యకు చేరుకుంటుందన్నారు.

మొదటి అంతస్తులో 80 శాతం పనులు పూర్తయ్యాయని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వెల్లడించారు. మొదటి అంతస్తులో 17 స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా రెండింటి పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ను సిద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి ఆ పనులను పూర్తి చేస్తామన్నారు. మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణాన్ని కూడా డిసెంబర్ 15 వరకు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఆలయ ప్రారంభానికి సంబంధించి పలు రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో రెండు కోట్లకు పైగా కరపత్రాలను ముద్రించామని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయంలో పూజ చేసిన తర్వాత అక్షతలతో పాటు కరపత్రాలను దేశంలోని ప్రతి ఇంటికి పంపిస్తామని చెప్పారు. నవంబర్ 5న అయోధ్యలో జరిగే పూజకు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులను ఆహ్వానించామన్నారు.

‘అక్షత పూజ’ను నవంబర్ 5న నిర్వహించనున్నారు. ఈ పూజ కోసం ఇప్పటికే ఆలయ ట్రస్టు 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఆర్డర్ ఇచ్చింది. అలాగే అక్షతల్లో కలిపేందుకు ఒక క్వింటాల్​ పసుపుతో పాటు దేశీ నెయ్యికి కూడా ట్రస్టు ఆర్డర్ పెట్టింది. ఇలా కలిపిన బియ్యాన్ని ఇత్తడి కలశాల్లో నింపనున్నారు. అనంతరం పూజ సమయంలో ఆ కలశాలను రాముడి విగ్రహం ముందు పెట్టి పూజ చేయనున్నారు. ఇలా పూజలో వినియోగించిన అక్షతలను వీహెచ్‌పీ​ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు పంపిణీ చేస్తామని ట్రస్టు సభ్యులు చెప్పారు.

ఒక్కో వీహెచ్​పీ ప్రతినిధికి ఐదు కిలోల చొప్పున బియాన్ని ఇస్తామని ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. అనంతరం వాటిని జిల్లాల ప్రతినిధులకు, అక్కడ నుంచి బ్లాక్​లు, మండలాలు, గ్రామాల్లోని ప్రజలకు అక్షతలను అందజేస్తామన్నారు. మరోవైపు శ్రీ రాముడి కోసం పెద్ద ఎత్తున బంగారం, వెండి వస్తువులను విరాళంగా ఇచ్చారని అన్నారు. దీంతో వాటిని నిల్వ చేయడం కష్టంగా మారిందన్నారు. అందుకే పేరున్న జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలో కరిగిస్తామని వివరించారు.

You may also like

Leave a Comment