క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ (Muttaiah Muralidharan) జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800ల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ (Cricketer) ఆయనే. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముత్తయ్య మురళీధరన్ ముచ్చటించారు. తనకు విశాఖ (Visakhapatnam) అంటే చాలా ఇష్టమని చెప్పారు.
క్రికెటర్‌గా మురళీధరన్ ఆటలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధించిన ఘనతలు ఇలా ఆయన జీవితంలోని ముఖ్యమైన విషయాలతో ‘800’ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను మాధుర్ మిట్టల్ పోషించారు.
భారత్‍లో వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలతో ఓ క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే తాను టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటానని మురళీధరన్ అన్నారు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టంమని, అందుకే ఆయనేన తన తొలి ఎంపికని అన్నారు. అలాగే దేశంలో తనకి బాగా ఇష్టమైన ప్రదేశం విశాఖ అని, ఎందుకంటే ఇక్కడి వాతావరణం శ్రీలంక వాతావరణాన్ని పోలి ఉండటమేనని అన్నారు.
అలాగే రాజకీయాలంటే తనకు పెద్దగా తెలియదని…కొందరు సినిమా యాక్టర్లు తెలుసునన్నారు. సెలెబ్రెటీలతో క్రికెట్ జట్టు ఏర్పాటు చేయాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, నాని, ప్రభాస్‍లను జట్టులోకి తీసుకుంటానని అన్నారు. తనకు సినిమాలంటే ఇష్టమని అందుకే ఇతర పెద్ద స్టార్లను కూడా జట్టులోకి తీసుకుంటానని అన్నారు. నాని చేసిన సినిమా జెర్సీని చూశానని, అతడితో ఫోన్‍లో మాట్లాడానని మురళీధరన్ అన్నారు. నాని సినిమాలు తనకు నచ్చుతాయని చెప్పారు.
ఈ 800 సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తన లెగసీకి వచ్చే నష్టం, లాభం ఏదీ లేదన్నారు. నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని చేసిన ప్రయత్నం ‘800’ సినిమా అని, అది కొందరికి నచ్చవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చునని మురళీధరన్ చెప్పారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, సింహళీ భాషల్లో విడుదల అవుతోంది. శ్రీలంక ప్రజలు చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం మేం సింహళీ భాషలో కూడా విడుదల చేస్తున్నాం. శ్రీలంకలో సింహళీ వెర్షన్ విడుదల చేస్తున్నామని తెలిపారు.