సిరియాలో ఇరాన్ (Iran) మద్దతుతో పని చేస్తున్న సాయుధ దళాలపై అమెరికా (USA) వైమానిక దళం విరుచుకు పడింది. సిరియాలో ఓ ఆముధగారం (weapons storage facility)పై వైమానిక దాడులు జరిపినట్టు అమెరికా వెల్లడించింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించినట్టు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ అస్టిన్ ( Lloyd Austin) వెల్లడించారు. ఇటీవల సిరియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ బలగాలు చేసిన దాడికి ప్రతిగా ఈ దాడులు జరిగాయన్నారు.
తూర్పు సిరియా ప్రాంతంలో ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC),దాని అనుబంధ గ్రూపులకు చెందిన స్థావరాలపై అమెరికా సైనిక దళాలు ఆత్మ రక్షణ దాడులు చేశాయని అస్టిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సిరియాలోని ఆయుధగారంపై అమెరికాకు చెందిన రెండు యూఎస్ ఎఫ్-15 విమానాలు ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు.
అమెరికా సైనిక దళాలపై దాడులను తాము ఏ మాత్రం సహించబోమని చెప్పారు. అందుకే ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్టు ఆయన ఆరోపించారు. ఇరాన్ చర్యలను చూస్తూ తాము ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా పౌరుల, దళాల రక్షణకు మరిన్ని అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియా ప్రాంతానికి మొత్తం విస్తరించకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోందన్నారు. అదే సమయంలో ఈ దాడులకు గాజా యుద్దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పునరుద్ధరణను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్‌లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇటీవల ఆయా ప్రాంతాల్లోని అమెరికా సైనిక శిబిరాలపై దాడులు జరిగాయి.