అయోధ్య (Ayodhya) లో రామ మందిర నిర్మాణ పనులు చకా చకా జరుగుతున్నాయి. ఇప్పటికే అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Consecration) కు ఇప్పటికే తేదీలను కూడా ట్రస్టు సభ్యులు ఖరారు చేశారు. తాజాగా ఆలయ నిర్మాణం కోసం చేస్తున్న ఖర్చుల వివరాలను శ్రీ రామ క్షేత్ర తీర్థ ట్రస్టు వెల్లడించింది. 5 ఫిబ్రవరి 2020 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఆలయ నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది.
ఇంకా ఇప్పటికి ట్రస్టు బ్యాంకు ఖాతాల్లో రూ. 3000 కోట్లు నిల్వ ఉన్నట్టు ట్రస్టు వెల్లడించింది. ట్రస్టు సభ్యుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సమావేశం అనంతరం సమావేశ వివరాలను ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. సమావేశంలో మొత్తం 18 అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు పేర్కొన్నారు.
సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కథా మ్యూజియం లీగల్ ట్రస్ట్‌గా ఉంటుందని తెలిపారు.
రామ మందిరానికి 500 ఏళ్ల చరిత్ర, 50 ఏళ్ల చట్టపరమైన పత్రాలు ఈ మ్యూజియంలో భద్ర పరుస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు సుమారు 10 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ట రోజు సూర్యాస్తమయం తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ఇంటి ముందర దీపాలు వెలిగించాలని ఆయన కోరారు.
ప్రాణ ప్రతిష్టకు ముందు రాముని ఎదుట అక్షత పూజ చేయనున్నారు. అనంతరం అక్షతలను దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జనవరి 1 నుంచి 15 వరకు ఈ అక్షతలను మొత్తం 5 లక్షల గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.