రెండు జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడికి పోయింది. అల్లర్ల నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులయ్యారు. అల్లర్లు మొదలై సుమారు ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 175 మంది మరణించినట్టు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,118 మంది గాయపడగా, మరో 98 గుర్తు తెలియని మృత దేహాలు ఇంకా మార్చురీలోనే వున్నాయని తెలిపారు.
పోలీసు శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం….. ఆస్తులకు నిప్పటించిన ఘటనల్లో ఇప్పటి వరకు 5172 కేసులు నమోదయ్యాయి. అందులో 4,786 ఇళ్లను, 386 మత పరమైన ప్రదేశాలకు అల్లరి మూకలు నిప్పంటిచాయి. ఈ ఘటనలో 254 చర్చిలు, 132 ఆలయాలకు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. హింస చెలరేగిన రోజు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆయుధగారంలోని 5,668 ఆయుధాలను అల్లరి మూకలు ఎత్తుకెళ్లాయి.
వాటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. వాటితో పాటు 15,050 మందు గుండు సామాగ్రి, 400 బాంబులను భద్రతా దళాలు రికవరీ చేశాయి. రాష్ట్రంలోని 360 అక్రమ బంకర్లను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఇది ఇలా వుంటే రాష్ట్రంలో నెలకొన్న హింస గురించి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టును కొట్టి వేయాలని ఇంటర్నేషనల్ మెయిటీస్ ఫోరమ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
ఇది ఇలా వుంటే మెయితీ తెగ ప్రతినిధులు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను గురువారం కలిశారు. రాష్ట్రం నుంచి అసోం రైఫిల్స్ బలగాలను ఉపసంహరించాలని కోరారు. అసోం రైఫిల్స్ బదులుగా మరో యూనిట్ కు చెందిన భద్రతా బలగాలను రాష్ట్రానికి పంపాలని రాజ్ నాథ్ సింగ్ ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మెయిటీ ప్రతినిధులు మెమోరాండం అందజేశారు.