యూపీ (UP) ఆస్పత్రిలో చిన్నారులకు హెచ్ఐవీ (HIV) ఘటనపై బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బీజేపీ చేసిన క్షమించరాని నేరానికి పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కార్ మన ఆరోగ్య వ్యవస్థను రెట్టింపు అనారోగ్యానికి గురి చేసిందని మండిపడ్డారు.
యూపీలోని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియాతో బాధపడుతున్న 14 మంది పిల్లలకు వ్యాధి సోకిన వ్యక్తుల రక్తాన్ని ఎక్కించారని తెలిపారు. దీని కారణంగా ఆ పిల్లలకు హెచ్ఐవి ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ వంటి తీవ్రమైన వ్యాధులు సోకాయి అని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్వవహరించడం సిగ్గుచేటని అన్నారు.
భారతావని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పది ప్రతిజ్ఞలు చేయాలని దసరా సందర్బంగా ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. పది నిర్ణయాలు తీసుకోవాలంటూ నిన్న ప్రధాని మోడీ పెద్ద పెద్ద విషయాలు బోధించారని అన్నారు. తమ బీజేపీ ప్రభుత్వాల్లో కనీసం ఇసమంతైనా జవాబుదారీతనాన్ని ప్రధాని మోడీ నింపారా అని ఆయన ప్రశ్నించారు.
యూపీలో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్ లోని లజపతి రాయ్ ఆస్పత్రిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 14 మంది బాలలకు ఇటీవల రక్తం ఎక్కించారు. తాజాగా వారికి హెచ్ఐవీ, హెపటైటీస్-బీ, సీ వంటి వ్యాధులు వచ్చినట్టు గుర్తించారు. మొత్తం 180 మందికి రక్తం ఎక్కించగా వారిలో 7 గురికి హెపటైటీస్-బీ, ఐదుగురికి హెపటైటీస్-సీ, ఇద్దరికి ఎయిడ్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు.