షహీద్ హేము కలానీ (Hemu Kalani)… చిన్న తనం నుంచే బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట యోధుడు ఆయన.విదేశీ వస్తు బహిష్కర ణతో బ్రిటీష్ వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని చూసిన గొప్ప యోధుడు. క్విట్ ఇండియా (Quit India) ఉద్యమంలో బ్రిటీష్ సేనలు ప్రయాణిస్తున్న రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేసి ఉరి కొయ్యల ఉగ్గుపాలు తాగాడు.
23 మార్చి 1923న సింధీ కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లి దండ్రులు ఇస్మాల్ కలానీ, జేతీ భాయ్. చిన్న తనం నుంచే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రచారం చేశాడు. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో నిరసనల్లో పాల్గొన్నారు.
1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమానికి మద్దతు పెరుగుతూ ఉండటంతో ఉద్యమ కారులను అణచి వేసేందుకు బ్రిటన్ నుంచి ప్రత్యేక దళాలను భారత్ కు పిలిపించారు. బ్రిటన్ నుంచి సైనికులు వస్తున్న రైలును గమనించి దాన్ని పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని గమనించిన బ్రిటీష్ అధికారులు హేముతో పాటు పలువురు నిరసన కారులను అరెస్టు చేశారు. ఇందులో కీలక కుట్రదారుల పేర్ల గురించి చెప్పాలంటూ హేమును చిత్ర హింసలకు గురిచేశారు. కానీ ఆయన వాళ్ల పేర్లను వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ కేసులో ఆయనకు ఉరిశిక్ష విధించారు. దీంతో ఆయనకు క్షమాబిక్ష ప్రసాదించాలని సిందీ ప్రజలు బ్రిటీష్ వారిని కోరారు. దీంతో మిగత కుట్రదారుల పేర్లు చెబితే శిక్షను రద్దు చేస్తామనగా దానికి ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన్ని ఉరి తీశారు.