ఇజ్రాయిల్ (Israel) -హమాస్ (Hamas) దళాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. హమాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు దాడులు చేస్తున్నాయి. మొత్తం 250 హమాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినట్టు ఆ దేశ సైన్యం తెలిపింది.
ఓ మసీదు పక్కనే ఉన్న మిస్సైల్ లాంచర్‌ను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేసింది. హమాస్ ఉగ్రవాదులు పబ్లిక్ స్థలాలను తమ ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారని చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని ఐడీఎఫ్ పేర్కొంది. గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఉగ్ర సంస్థకు చెందిన సుమారు 250 కేంద్రాలను యుద్ద విమానాలతో పేల్చి వేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
హమాస్ మిలిటెంట్లకు చెందిన కమాండ్ సెంటర్లు, సొరంగ మార్గాలు, రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశామని వెల్లడించింది. ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఉన్న హమాస్‌కు చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంఛర్‌ను తమ నౌకాదళం పేల్చినట్లు తెలిపింది.
రాకెట్ లాంఛర్ ఓ మసీదు, పిల్లలు స్కూల్ సమీపంలో ఉందని చెప్పింది. దక్షిణ గాజాను ఖాళీ చేసి వెళ్లకుండా పౌరులను హమాస్ మిలిటెంట్లు అడ్డుకుంటున్నట్టు ఐడీఎఫ్ చెప్పింది. దీనికి సంబంధిచి గాజా పౌరులు ఇజ్రాయెల్ సైనికులతో మాట్లాడిన ఆడియో సంభాషణలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.