ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ క్రీడాకారుల ప్రదర్శనకు స్పూర్తి పొందిన భారత్ పారా అథ్లెట్లు.. పతకాల వేటను కొనసాగిస్తున్నారు. చైనా, హాంగ్జౌ (Hangzhou) వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ఒక్కరోజే 19 పతకాలు (3 స్వర్ణ, 3 రజత, 13 కాంస్యాలు) ఇండియా ఖాతాలో పడ్డాయి.. 2018 ఇండోనేషియాలో ఇప్పటి వరకూ గెలిచిన 72 (15 పసిడి, 24 వెండి, 33 కాంస్యం)పతకాలు అత్యధికం కాగా.. ఈసారి రికార్డు స్థాయిలో 82 పతకాలు గెలిచిన అథ్లెట్లు దేశమంతా గర్వపడేలా చేశారు.
మొదట సచిన్ సర్జేరావు.. పురుషుల ఎఫ్ 46 షాట్‌పుట్ పోటీలో ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించారు. ఆర్ 6 మిక్స్డ్ 50 మీటర్ల పోటీలో పారా షూటర్ సిద్ధార్థ బాబు పసిడి వెలుగులు విరజిమ్మాడు. శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జంట ఆర్చరీ (Archery) కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో చైనా ద్వయాన్ని 151-149తో చిత్తు చేసి బంగారు పతకం దక్కించుకుంది.
టీ12-100 మీటర్ల పరుగులో సిమ్రాన్ వెండి (silver)పతాకం సాధించగా, భాగ్యశ్రీ మాధవ్‌రావు జాదవ్ షాట్‌పుట్‌లో రజతంతో మెరిశారు. పురుషుల టీ37-100 మీటర్ల రేసులో నారాయణ్ ఠాకూర్ కాంస్య పతకం గెలిచాడు. మరోవైపు ఇప్పటిదాకా 82 పతకాలు (18 స్వర్ణ, 23 రజత, 41 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్.. 2018 జకార్తా క్రీడల్లో నమోదైన 72 పతకాల రికార్డును బద్దలుకొట్టింది. ఆటలు ముగియడానికి మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో భారత్ వంద పతకాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం 8వ స్థానంలో కొనసాగుతోంది.