కోపం ఆవేశం సృష్టిలో ఉన్న ఏ ప్రాణికైనా ఒకటే.. భావోద్వేగాలు మనసుని శాసిస్తాయని ఎన్నో సార్లు నిరూపించబడింది. కాకపోతే మనిషికి ఆలోచన శక్తి, విచక్షణా జ్ఞానం ఉంటుంది. జంతువులకు అలాంటివి ఉండవని ఎన్నో సార్లు నిరూపించాయి.. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడు (Tamilnadu) లో వెలుగు చూసింది.
నీలగిరి జిల్లా కిల్తట్టపల్లం ప్రాంతంలో ఓ అడవి ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. ఆడవి నుంచి కొత్తగిరి (Kothagiri) మెట్టుపాళయం (Mettupalayam) రహదారిపైకి వచ్చిన ఆ ఏనుగు అటువైపు వెళ్తున్న ఓ టూరిస్ట్ కారు పై దాడికి దిగింది. కారు ధ్వంసం చేసింది.. అనంతరం ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. కాగా ఏనుగుని చూసిన ప్రయాణికులు కారు దిగి పారిపోవడం మంచిది అయ్యింది. లేకుంటే జరిగే నష్టాన్ని ఊహించడం కష్టంగా ఉండేది.
ఈ యాంగ్రీ ఏనుగు ఆవేశాన్ని దారిలో వెళ్తున్న వాహనదారులు కొందరు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా, ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.. మరోవైపు ఈ సంఘటన కారణంగా ఘాట్లో అరగంటకు పైగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఏనుగు మళ్లీ ఘాట్ పైకి రాకుండా చర్యలు చేపట్టారు.