డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్.. భారత అంతరిక్ష పితామహుడు. దేశంలో అంతరిక్ష పరిశోధనలకు బాటలు వేసిన మొదటి శాస్త్రవేత్త. చంద్రయాన్-3 లాంటి అద్భుతమైన పరిశోధనలతో నేడు అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఇస్రోకు పునాదులు వేసిన గొప్ప సైంటిస్ట్.
1919 ఆగస్టు 12న ముంబై ప్రావిన్స్(ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం) అహ్మదాబాద్ లో జన్మించారు విక్రమ్ సారాభాయ్. ఈయన తల్లి దండ్రులు అంబాలాల్ సారాభాయ్, సరళాదేవి. అహ్మదాబాద్ లోని గుజరాత్ కళాశాలలో ఈయన మెట్రిక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. 1940లో అక్కడ నేచురల్ సైన్సెస్ లో ఉత్తీర్ణులయ్యారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత్ కు తిరిగి వచ్చారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ నేతృత్వంలో పరిశోధనలు మొదలు పెట్టారు. దేశంలో మొట్ట మొదటగా శాటిలైట్ అవసరాలను గుర్తించి నెహ్రూని ఒప్పించి భారత్ ను అంతరిక్ష పరిశోధనల వైపు నడిపించారు.
అంతరిక్ష రంగంలో విక్రమం సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పలు అవార్డులను ప్రదానం చేసింది. 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో సత్కరించింది. 1966లో పద్మ భూషణ్ అవార్డును అందజేసింది. విక్రమ్ సారాభాయ్ 1971 డిసెంబరు 31వ తేదీన మరణించారు.