మహారాష్ట్ర (Maharastra) డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఏక్ నాథ్ షిండేపై అనర్హత వేటు పడబోదని తెలిపారు. ఒక వేళ షిండేపై అనర్హత వేటు పడినప్పటికీ ఆయన పదవిలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. కేవలం తమ వద్ద ప్లాన్ ఏ మాత్రమే ఉందని ప్లాన్ బీ లేదని… షిండేనే సీఎంగా ఉంటారని తేల్చి చెప్పారు.
మొదట షిండే పై అనర్హత వేటు పడబోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము కూడా న్యాయశాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని చదివామన్నారు. ఇప్పటి వరకు జరిగిందంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. సీఎంగా షిండే కొనసాగుతారని ఫడ్నవీస్ స్పష్టం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. షిండే, ఇతర ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీం కోర్టు ఆదేశాలు, శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు విషయంలో ఎన్నికల సంఘాల ఆదేశాలను అర్థం చేసుకున్నవారికి షిండే అనర్హుడగా ప్రకటించబడరని అర్థం అవుతుందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.
షిండేపై అనర్హత వేటు అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందన్నారు. ఒక వేళ ఆయనపై అనర్హత వేటు పడిని ఆయన సీఎంగా కొనసాగుతారని తెలిపారు. ఒక వేళ ఆయన ఎంఎల్సీగా ఉంటే సీఎంగా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అనర్హత వేటు అనేది కేవలం ఉద్దవ్ ఠాక్రే, ఆయన వర్గం నేతలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అన్నారు.
ఇక షిండేను సీఎంగా కొనసాగిస్తామని గతంలోనే అజిత్ పవార్ కు చెప్పామని అన్నారు. ఆ ఒప్పందానికి అంగీకరించిన తర్వాతే అజిత్ పవార్ తమ కూటమిలో చేరారని వెల్లడించారు. అజిత్ దాదా మంచి పరిణతి చెందిన రాజకీయ నేత అని కొనియాడారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పామని, అన్నట్టుగానే ఆయనకు ఆ పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు.