మరాఠా రిజర్వేషన్ల (Maratha reservations) ఉద్యమం హింసాత్మకంగా మారుతోంది. పలు చోట్ల ఆందోళన కారులు విధ్వంసానికి దిగుతున్నారు. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేల (MLA) ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మొదట బీడ్ జిల్లాలో ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి (Prakash Solanki) ఇంటికి నిరసనకారులు నిప్పటించారు. మంటలు చెలరేగిన సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు.
తాము క్షేమంగానే ఉన్నామని కొద్ది సేపటికి ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. ఇటీవల మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న నేత మనోజ్ జరంగే పాటిల్ పై ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ సోలంకి నివాసానికి ఆందోళనకారులు నిప్పటించినట్టు తెలుస్తోంది.
అనంతరం మరో ఎన్సీపీ ఎమ్మెల్యే క్షీర సాగర్ ఇంటికి, కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పటించారు. ఆయన ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన వాహనాలపై దాడి చేసి వాటికి కూడా నిప్పు పెట్టారు. మరోవైపు మాజీ మంత్రి, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన నేత జయదత్త క్షీర సాగర్ జీ ఇంటికి కూడా నిప్పంటించారు.
వడ్గావ్ నింబాల్కర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పోస్టర్లను ఉద్యమకారులు చించి వేశారు.
అటు మజల్‌గావ్ లోనూ ఉద్యమకారులు బీభత్సం సృష్టించారు. రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ భారీగా మరాఠా నిరసనకారులు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకు వెళ్లారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వ్ంసం చేసి నిప్పంటించారు.