ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani)కి బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వక పోతే ముఖేశ్ అంబానీని చంపేస్తామంటూ ఈ మెయిల్లో (Email) ఆగాంతకుడు బెదిరించాడు. అంబానీ కంపెనీకి సోమవారం ఈ మేరకు మెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది.
గత నాలుగు రోజుల్లో ఇది వరుసగా మూడో బెదిరింపు మెయిల్ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రూ. 20 కోట్లు ఇవ్వాలని, లేక పోతే ముఖేశ్ అంబానీని చంపేస్తామంటూ అంబానీకి శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. దీంతో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన గామ్ దేవీ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దర్యాప్తు కొనసాగుతుండగానే శనివారం మరో సారి దుండగులు బెదిరింపు మెయిల్ పంపారు. రూ. 200 కోట్లు ఇవ్వాలని మెయిల్ లో డిమాండ్ చేశారు. ఇంతలోనే శనివారం మరోసారి బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది.
దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితున్ని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. ఇది ఇలా వుంటే గతేడాది ముఖేశ్ అంబానీకి బెదిరింపు కాల్స్ చేసిన బిహార్ లోని దర్బాంగాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.