యాపిల్ ( Apple) ఐ ఫోన్లు (I Phones) హ్యాకింగ్ కు గురయ్యాయంటూ విపక్ష పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. మొత్తం 150 దేశాల్లో యాపిల్ కంపెనీ ఇలా వార్నింగ్ మెసేజ్‌లు పంపిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. అప్పుడప్పుడు అలర్ట్‌లు తప్పుగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటికే ఈ వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో కేంద్రం దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. దర్యాప్తునకు సహకరించాలని యాపిల్ సంస్థను కూడా కోరుతున్నట్టు తెలిపారు. గతంలో కూడా విపక్ష ఎంపీలు ఇలాంటి ఆరోపణలే చేశారన్నారు. అప్పుడు కూడా తాము దర్యాప్తు చేపట్టామని కేంద్ర మంత్రి వివరించారు.
ప్రియాంక గాంధీ ఇద్దరు పిల్లల ఫోన్లను కూడా హ్యాక్ చేశారంటూ అప్పుడు ఆరోపణలు చేశారన్ని అన్నారు. కానీ అలా జరగలేదన్నారు. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలోనే దర్యాప్తు పూర్తి చేశామన్నారు. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాలని అనుకున్న వాళ్లే ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ విపక్షాలపై ఆయన మండిపడ్డారు.
దేశంలో ఈ రోజు యాపిల్ ఫోన్ల హ్యాకింగ్ వార్త కలకలం రేపింది. తమ ఐఫోన్లు హ్యాకింగ్ అవుతున్నాయంటూ విపక్ష నేతలు ఈ రోజు సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ యాపిల్ సంస్థ అలర్ట్ పంపిందని తెలిపారు. ఈ మేరకు యాపిల్ సంస్థ పంపిన సందేశాలను స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.