దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత (AQI) అత్యంత పేలవంగా (Very Poor) ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ ఈరోజు 336గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో వాయు నాణ్యత చాలా పేలవంగా ఉన్నట్టు సఫర్ వెల్లడించింది. అదివారం వాయు నాణ్యత సూచీ 309 అత్యంత పేలవంగా ఉందని పేర్కొంది.
ఇక ఢిల్లీ యూనివర్శిటీ ప్రాంతంలో ఏక్యూఐ 391 ఉండగా, పూసాలో 311గా ఉన్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ ఏరియాలో 329గా ఉంది. అదే విధంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు, మధురా రోడ్డులో కూడా ఏక్యూఐ చాలా పేలవంగా ఉన్నట్టు చెప్పింది. ఎయిర్ పోర్టు ఏరియాలో 339, మధురా రోడ్డులో 362గా ఉన్నట్టు వెల్లడించింది.
నోయిడాలో ఏక్యూఐ 391, గురుగావ్ 323 అత్యంతం పేలవంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏక్యూఐ 0 నుంచి 100 మధ్య ఉంటే వాయు నాణ్యత బాగా ఉన్నట్టు పరిగణించవచ్చు. 100 నుంచి 200 వరకు ఉంటే వాయు కాలుష్యం మితంగా ఉన్నట్టు అని పేర్కొన్నారు. 200 నుంచి 300 వరకు ఉంటే పేలవంగా ఉన్నట్టని అన్నారు.
300 నుంచి 400 మధ్య ఉంటే అత్యంత పేలవంగా, 400 నుంచి 500 అత్యంత తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తారని అన్నారు. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు 15 పాయింట్స్ తో వింటర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.