లోక్ సభ (Lok Sabha)లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ (BRS) ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama Nageswararao) కేంద్రం తీరును తప్పుబడుతూ.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై బీజేపీ (BJP)కి ఎందుకంత కక్ష అంటూ మండిపడ్డారు. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని.. కేంద్రం తెలంగాణకు వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న మోడీ సర్కార్ పై విమర్శలు తగదని.. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు సంజయ్. ప్రధాని మణిపూర్ ఎందుకు వెళ్లడం లేదని అంటున్న బీఆర్ఎస్.. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, యువత, 317 జీవో వల్ల ఉపాధ్యాయులు చనిపోతే కనీసం పరామర్శించేందుకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని చూస్తుంటే గజినీ గుర్తుకువస్తున్నారని.. తెలంగాణలో కాంగ్రెస్ జీరో అయిందన్నారు.
నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండి. లిక్కర్ పార్టీతో సంబంధాలు కాంగ్రెస్ పార్టీకే ఉందంటూ కవిత, రేవంత్ మధ్య ఉన్న వ్యాపార లావాదేవీలను పరోక్షంగా ప్రస్తావించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారని.. అది నిజమని నిరూపిస్తూ తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తెలంగాణ రైతు సగటు ఆదాయం రూ.1,12,836 అయితే.. కేసీఆర్ వ్యవసాయ ఆదాయం కోటి రూపాయలు అని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ కుటుంబానికి ఆదాయం ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు.
యూపీఏ కూటమి ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు సంజయ్. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని చురకలంటించారు. కేసీఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుమారుడి ఆస్తులు 400 రెట్లు పెరిగాయని.. సీఎం భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద విడుదల చేస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు బండి సంజయ్.