Telugu News » Bandi Sanjay : నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..!

Bandi Sanjay : నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..!

తనకు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించానన్నారు బండి. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు.

by admin
Bandi Sanjay Files Nomination From Karimnagar

– కరీంనగర్ స్థానానికి బండి నామినేషన్
– కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ
– పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన విషయాల్ని..
– గుర్తు చేసిన బండి
– సంజయ్ వ్యక్తి కాదు..
– శక్తి అంటూ రాజాసింగ్ ప్రశంసలు

ధర్మం కోసం పోరాడేది ఒక్క బీజేపీ (BJP) మాత్రమేనని అన్నారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). కరీంనగర్ (Karimnagar) అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున ఆయన నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. దీనికి ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, రాజాసింగ్ ధర్మం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు.

Bandi Sanjay Files Nomination From Karimnagar

కాషాయ జెండాను ఏనాడూ వదలలేదని, అధిష్టానం అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని బలోపేతం చేశానని చెప్పారు సంజయ్. తెలంగాణ కోసం పోరాడితే జైల్లో పెట్టారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ బాక్సులు బద్దలవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెట్టి తనను జైలుకు పంపించారని మండిపడ్డారు. కరీంనగర్ లో కాషాయజెండాకు తప్ప మరో పార్టీ జెండాకు చోటు లేదని చెప్పారు.

బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు బండి. కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, వీటికి వ్యతిరేకంగా పోరాడితే తనపై 30 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా, తనపై మతతత్వ ముద్ర వేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. హిందువులు ఐక్యం కారని అవహేళన చేశారని, కానీ తాను 80 శాతం మంది హిందువులను ఒక్కటి చేసి చూపించానని తెలిపారు.

తనకు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించానన్నారు బండి. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. బీజేపీ బలోపేతం కోసం తెలంగాణవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించినట్లు చెప్పారు. ఆ సమయంలో పార్టీ గ్రామగ్రామాన విస్తరించిందని వివరించారు.

మీరు ఎవరివైపు ఉంటారు?- రాజాసింగ్

బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ మాట్లాడుతూ.. ధర్మం కోసం, ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా? అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్థి వైపు ఉంటారా? అనేది తేల్చుకోవాలని కోరారు. బండి వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవని సెటైర్లు వేశారు. కరీంనగర్‌ లో పెద్దన్న బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని.. గంగుల అవినీతికి అంతులేకుండా పోయిందని విమర్శించారు రాజాసింగ్.

You may also like

Leave a Comment