భారత్ (Bharat) వేదికగా జరుగుతున్న క్రికెట్ మహా సంగ్రామం చాలా మందిని ఉత్కంఠకు గురిచేస్తున్న విషయ తెలిసిందే.. ఈ క్రికెట్ కొందరికి వినోదాన్ని పంచుతుంటే, మరికొందరికి తీవ్ర శోకాన్ని మిగిల్చుతోంది. ముఖ్యంగా భారత్ (India) చేతిలో ఘోర పరాభవం చవిచూసిన శ్రీలంక (Sri Lanka) జట్టు బ్యాట్స్ మెన్ మాథ్యూస్ (Mathews) ఒక రికార్డ్ సృష్టించాడు. శ్రీలంక వరల్డ్ కప్ (World Cup) గెలుస్తుందో లేదో తెలియదు కానీ.. వరల్డ్ రికార్డ్ మాత్రం సాధించిందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..
ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చిత్రం జరిగింది. సమయానికి క్రీజులోకి చేరుకోక పోవడంతో అంపైర్లు లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్ (Timed Out)గా ప్రకటించారు. ఒక బ్యాటర్ ఇలా ఔటవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే తన లేటుకు కారణం అంపైర్లకు చెప్పాలని చూశాడు.. శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ వాదనను అంపైర్లు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
ఈలోపల బంగ్లా ఫీల్డర్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. మరోవైపు 25వ ఓవర్ రెండో బాల్‌కు శ్రీలంక బ్యాట్స్ మెన్ సమర విక్రమ ఔటయ్యాడు. అతని స్థానంలో క్రీజులోకి రావాల్సిన మాథ్యూస్ హెల్మెట్ సరిగ్గా లేదని మరొకటి కావాలని డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేశాడు. అయితే కరుణరత్నే హెల్మెట్ అందించే వరకు మూడు నిమిషాలకు పైగా సమయం దాటింది..
కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం.. బ్యాటర్ ఔట్ అయిన తర్వాత లైనప్‌లో ఆడాల్సిన బ్యాటర్ రెండు నిమిషాల లోపు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. అలా రాకపోతే టైమ్డ్ ఔట్ ప్రకటించే అధికారం అంపైర్లకు ఉంటుంది. ఇక్కడ కూడా ఇదే జరిగింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఆటగాడు టైమ్డ్ ఔటైన సందర్భాలు ఒక్కటి కూడా లేవు.. కానీ 1997లో ఒడిశాలోని కటక్‌లో త్రిపుర్, ఒడిశా జట్ల మధ్య జరిగిన దేశీయ క్రికెట్లో మాత్రం ఇలాంటి ఘటన జరిగింది. ఆ మ్యాచ్‌లో హేములాల్ యాదవ్ అనే బ్యాట్స్ మెన్ టైమ్డ్ ఔట్‌కు గురయ్యాడు.