బంగాళాఖాతం (Bay Of Bengal)లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. దీంతో బంగాళాఖాతంలో భారీగా అలలు తీర ప్రాంతానికి పోటెత్తాయి. ఉదయం 5.32 గంటలకు భూకంపం సంభవించినట్టు పేర్కొంది.
ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం గానీ జరగలేదని అధికారులు వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులకు వాయవ్య దిశగా సుమారు 200 నాటికల్ మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది. సముద్ర అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు పేర్కొంది.
మరోవైపు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. పిత్తోర్ గఢ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా ఉన్నట్టు ఎన్ సీఎస్ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్ లో కేంద్రీకృతం అయినట్టు పేర్కొంది. దార్చులా, దిదీహట్, బంగపానీ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
ఇక నేపాల్ రాజధాని ఖట్మండూలో నిన్న భూకంపం సంభవించింది. ఉదయం జాజర్ కోట్ దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. బలమైన భూకంపం కావడంతో దాని ప్రభావం రాజధాని ఖట్మండుపై కూడా పడిందని తెలిపింది.