దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ( Air Pollution) మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేసేందుకు ఆప్ (AAP) సర్కార్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ, నేత ఎంపీ రమేశ్ బిదూరీ (Ramesh Bidhuri) తీవ్ర విమర్శలు గుప్పించారు.
దీపావళికి పండుగకు ముందు ఈ నిబంధనను తీసుకు రావడాన్ని సనాతన ధర్మంపై ఆప్ సర్కార్ చేస్తున్న కుట్రగా ఆయన ఆరోపించారు. దీపావళి రోజు హిందువులంతా ఒకరి నొకరు కలుసుకోకూడదనే సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను అర్బన్ నక్సలైట్‌గా బీజేపీ నేత అభివర్ణించారు. దేశాన్ని నాశనం చేసేందుకు విదేశీ శక్తులతో సీఎం కేజ్రీవాల్ చేతులు కలిపారని తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ వంటి నేతల వల్ల భారత సంస్కృతి పూర్తిగా కనుమరుగవుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దీపావళి పండుగ రోజు బాణా సంచాపై నిషేధం విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. విదేశీయుల నుంచి ఆప్ నేతలు డబ్బులు తీసుకుని ఇలా మన పండుగలపై ఉద్దేశ పూర్వకంగా నిషేధం విదిస్తున్నారని దుయ్యబట్టారు. లౌకిక మేధావులుగా చెప్పుకుంటున్న కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు కాలుష్యాన్ని అరికట్టేందుకు సరైన పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలన్నారు.