– కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
– అబద్ధాల్లో కేసీఆర్, కేటీఆర్ కు అవార్డ్ ఇవ్వాలి
– ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం
– దాని స్థానంలో మంచి పోర్టల్ తీసుకొస్తాం
– ఎవరికీ నష్టం జరగకుండా చూస్తాం
– ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం భూముల్ని దోచేసింది
– కాళేశ్వరం అంటూ లక్ష కోట్లు దిగమింగారు
– ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) కు అబద్ధాలు చెప్పడంలో ప్రైజ్ ఇవ్వాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్, ఆదిలాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ (Congress) విజయభేరి సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. రైతుబంధును 2018లో ప్రవేశపెట్టారని, ధరణి పోర్టల్ ను 2020లో తీసుకొచ్చారని, మరి.. ఆ రెండేళ్లు లబ్ధిదారులకు రైతుబంధు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
పేదల భూములను కంప్యూటరీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు రేవంత్. ఈ దేశంలోకి కాంగ్రెస్ పార్టీనే కంప్యూటర్ తెచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోందని మండిపడ్డారు. ఆదివాసీలను, లంబాడీలను కాపాడే బాధ్యత తమదని.. ఇరు తెగల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని స్పష్టం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చ మెత్తుకునేదన్నారు.
‘‘24 గంటల కరెంట్ ఇస్తున్నావా? సబ్ స్టేషన్ కు పోదాం. 24 గంటల కరెంట్ ఇస్తే మేము పోటీ చేయం’’ అంటూ కేసిఆర్ కు సవాల్ విసిరారు. ఈ సవాల్ కు ఒప్పుకుంటారా? లేదంటే ఇంద్రవెల్లిలో ముక్కు నేలకు రాస్తారా? అని ఛాలెంజ్ చేశారు రేవంత్. ధరణి స్థానంలో మంచి పోర్టల్ తీసుకొస్తామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ హయంలో ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తామని, వాటిని అమ్ముకునే సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. బరాబర్ ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. భూముల మీద హక్కులు కల్పిస్తామని చెప్పారు.
ధరణి ముసుగులో కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ పరిసర భూములను కబ్జా చేసిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయలు ఉన్నోళ్లకే బీఆర్ఎస్ – బీజేపీ టికెట్లు ఇస్తే, ఓట్లున్న వారికే కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్ దెబ్బ తీశారన్నారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దిగ మింగారని ఆరోపించారు. కేసీఆర్ ధన దాహనికి ప్రాణహిత ప్రాజెక్టు బలైందని.. కాంగ్రెస్ కట్టిన కడెం, సదర్ మాట్ ప్రాజెక్టులను పట్టించు కోలేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందని.. ధరణి తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దగ్గర నోట్లు ఉంటే.. తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదే అని తెలిపారు రేవంత్ రెడ్డి.