లండన్ (London)లో వింత ఘటన చోటు చేసుకుంది. కిటికీ అద్దాలు లేకుండా విమానం ఒకటి స్టాన్ స్టడ్ ( Stansted Airport) విమానశ్రయం నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత కిటికీలు అద్దాలు లేవని సిబ్బంది గుర్తించి విమానాన్ని వెనక్కి మళ్లించారు.
అక్టోబర్ 4న విమానం ఒకటి స్టాన్ స్టడ్ నుంచి ఫ్లోరిడాకు బయలు దేరింది. కొంత దూరం ప్రయాణించిన ఆ విమానానికి కిటికీలు మిస్ అయ్యాయని విమాన సిబ్బంది గుర్తించారు. అప్పటికే ఆ విమానం 14,500 అడుగుల ఎత్తుకు వెళ్లి పోయింది. వెంటనే విమానాన్ని మళ్లీ లండన్‌కు మల్లించారు. ఘటన సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.
విమానం అలాగే ముందుకు వెళ్లి వుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుని ఉండేవని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఏఏఐబీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ విమానానికి చెందిన రెండ్ కిటికీలు మిస్ అయినట్టు ఏఏఐబీ గుర్తించింది. మరో రెండు కిటికీలకు అద్దాలు సరిగా అమర్చనట్టు విచారణలో తేలిందని పేర్కొంది.
ఆ కిటికీ బయట అద్దాన్ని ప్రయాణికులు తాకకుండా ఏర్పాటు చేసే స్క్రాచ్ ప్యాన్ మాత్రమే అందులో ఉందని, విండో గ్లాసులు మిస్ అయ్యాయని పేర్కొంది. అంతకు ముందు రోజు విమానాన్ని గ్రౌండ్ ఫిల్మింగ్ కోసం ఉపయోగించారన పేర్కొంది. ఆ సమయంలో స్పెషల్ ఎఫెక్ట్ కోసం విమానం దగ్గరలో అత్యంత ప్రకాశవంతమైన లైట్లు వినియోగించినట్టు తెలిపింది.
నిబంధనల ప్రకారం ఆ లైట్లను విమాన అద్దాలకు 10 మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంచాల్సి వుంటుందని వివరించింది. కానీ లైట్లను కిటికీలకు ఆరు నుంచి 8 మీటర్ల దూరంలో ఉంచినట్టు ప్రాథమిక నివేదికలో తేలిందని రిపోర్టు చేసింది. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది.