బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (KCR) ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ (Gajjwel) తో పాటు కామారెడ్డి (Kamareddy) బరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. సమీకృత భవనంలో సీఎం నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు.
నామినేషన్ అనంతరం ప్రచార రథంపై హెలిప్యాడ్ చుట్టూ తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి వెళ్లి అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు కేసీఆర్. ఈ నామినేషన్ అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
2014లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లోనూ అక్కడి నుంచే బరిలోకి దిగి రెండో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. కానీ, ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీకి సై అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ పై బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢీ కొడుతున్నారు.
ఇటు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులతో కలసి ర్యాలీలు కొనసాగిస్తున్నారు.