గొప్ప దేశభక్తుడు.. నిస్వార్థ దార్శనిక నాయకుడు.. కోట్ల మంది భారతీయులకు ప్రేరణ.. హిందూ జాతిని తట్టిలేపి జాతిని ఏకీకృతం చేసిన మహోన్నతుడు.. ఇలా దత్తాత్రేయ బాపురావు ఠేంగ్డే గురించి చెప్పుకుంటూ పోతే అక్షరాలు సరిపోవు. ఆర్ఎస్ఎస్ ఆలోచన, సైద్ధాంతిక దృక్పథానికి సజీవ ఉదాహరణ ఠేంగ్డే.
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ఆర్వీలో 1920 నవంబర్ 10న జన్మించారు. 15 సంవత్సరాల వయసులోనే వానర్ సేన, ఆర్వీలోని మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నేనుసైతం అంటూ తెల్లదొరలకు చెమటలు పట్టించారు. 1936-38 వరకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడుగా పనిచేశారు. దీనదయాళ్ ఉపాధ్యాయ, బాబా సాహెబ్ అంబేద్కర్ ల జీవితాలతో ప్రభావితులయ్యారు.
1942లో ఆర్‌ఎస్‌ఎస్ లో ప్రచారక్ గా చేరిన దత్తాత్రేయ బాపురావు.. 1942-44 మధ్య కేరళలో, 1945-47లో బెంగాల్ లో, 1948-49లో అసోంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ గా పనిచేశారు. భారతీయ జనసంఘ్ స్థాపన సమయంలో 1951 నుండి 1953 వరకు సంఘటనా కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించారు. తన జీవన ప్రయాణంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఠేంగ్డే ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రజల కోసం మరెన్నో పోరాటాలు సాగించారు. ఎల్లప్పుడూ సమగ్రతను విశ్వసించిన ఈయన.. రాజకీయ అంటరానితనం ఆలోచనను తిరస్కరించారు. అత్యవసర పరిస్థితి కాలంలో లోక్ సంఘర్ష్ సమితి కార్యదర్శిగా దేశంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి సారథ్యం వహించారు. ఠేంగ్డే బహుముఖ ప్రజ్ఞాశాలి. మరాఠీ, హిందీ, ఆంగ్ల భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు.
ఎన్నో సంస్థలు ఈయన చేతులమీదుగా కార్యరూపం దాల్చాయి. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, సామాజిక సమరసత మంచ్, సర్వ-పంత్ సమదర్ మంచ్, పర్యవరణ్ మంచ్ వంటి అనేక ప్రసిద్ధ సంస్థలను స్థాపించారు. అంతేకాదు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ ఆదివక్త పరిషత్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ, భారతీయ విచారణ కేంద్రం వంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యులు.