ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం (Tunnel) ఒకటి కూలి (Collapsed) పోయింది. సొరంగంలో 40 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టాయి. యమునోత్రి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సొరంగ నిర్మాణం చేపట్టారు. సిల్క్యారా నుంచి దండల్ గావ్ వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో కూలీలు పాల్గొన్న సమయంలో సొరంగం ఒక్క సారిగా కూలిపోయింది.
ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తుమన్నారు. కూలీలను రక్షించేందుకు మూడు రోజుల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
శిథిలాలను తొలగించేందుకు వర్టికల్ డ్రిల్లింగ్ మిషన్లను ఉపయోగిస్తున్నామన్నారు. సొరంగంలోకి ఆక్సిజన్ పైపులు పంపి రక్షణ చర్యలు చేపట్టామన్నారు. ఘటనా స్థలంలో పోలీసు బలగాలు, రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని అన్నారు.