రాష్ట్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). కరీంనగర్ (Karimnagar) లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బండి మాట్లాడుతూ.. అణిచి వేసేందుకు తనపై 74 కేసులు పెట్టినా ఏనాడు భయపడలేదన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు ఇచ్చి తనను, పార్టీ అభ్యర్థులను గెలపించాలని పిలుపునిచ్చారు.
తాను ప్రశ్నించే గొంతుక అని కాపాడుకుంటారా? పిసికేస్తారా? మీ ఇష్టం అంటూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనను ఎన్నికల్లో గెలిపించే అంతిమ నిర్ణయం మీదేనని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పై తాను యుద్ధం చేస్తున్నానని.. కరీంనగర్ ప్రజలకు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) చేసిందేమీ లేదని విమర్శించారు. భూకబ్జాలు చేయడం, అవినీతికి పాల్పడటం, వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లు చేయడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ను ఎంఐఎం (MIM) కు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు బండి. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. అందుకు ప్రతిఫలంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేలా ఒప్పందం కుదిరిందని అన్నారు. గతంలో 12 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిస్తేనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా నల్లా జెండాలు పట్టుకుని తిరిగారని గుర్తు చేశారు. ఇక మేయర్ పదవి ఇస్తే ఊరుకుంటారా? అదే జరిగితే రేపటి నుండి బొట్టు పెట్టుకుని, కంకణం పెట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ ను రక్షించేందుకే తాను పోటీ చేస్తున్నానని తెలిపారు బండి. ఇక, దీపావళిని పురస్కరించుకుని శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించి.. శ్రీ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొన్నారు. ఈ దీప కాంతుల వెలుగులు మీకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలను అందించాలని అన్నారు. మీ జీవితం ఆనందమయం అవ్వాలని మనసారా కోరుకుంటూ హిందూ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్.