Telugu News » Kohli : సరిలేరు నీకెవ్వరు!

Kohli : సరిలేరు నీకెవ్వరు!

వన్డేల్లో విరాట్ కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేశాడు. దీంతో గతంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

by Ramu

– కోహ్లి సెంచరీల దండయాత్ర
– సచిన్ రికార్డ్ బ్రేక్
– వన్డే కెరీర్ లో 50వ సెంచరీ
– వరల్డ కప్ లో అత్యధిక రన్స్ చేసిన రికార్డ్
– కోహ్లి అంటూ మార్మోగిన స్టేడియం
– ప్రశంసల వెల్లువ

– సెమీస్ లోనూ దుమ్మురేపిన భారత్
– న్యూజిలాండ్ పై విజయం

ప్రపంచ కప్‌ (World Cup) లో పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. తాజాగా వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ తో జరిగిన సెమీస్ మ్యాచ్‌ లో పరుగుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) శతక్కొట్టాడు. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేశాడు. దీంతో గతంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.

ఇటు ప్రపంచ కప్‌ లో విరాట్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 80 పరుగుల దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌ లో అత్యధిక పరుగులు(674) చేసిన బ్యాటర్ గా ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది.

మాస్టర్ బ్లాస్టర్ 2003 వరల్డ్ కప్ లో అత్యధికంగా 673 పరుగులు చేశాడు. ఈ పరుగులను 11 ఇన్నింగ్స్ ల్లో చేయగా, కోహ్లి పది ఇన్నింగ్స్ లోనే అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్ మూడవ స్థానంలో ఉన్నాడు.

ఇక, న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ లో విరాట్ దుమ్మురేపాడు.  సిక్సులు, ఫోర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తం 9 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టిన కోహ్లి.. 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. టీమ్ సోదీ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్లు రోహిత్ (47), శుభ్‌ మన్‌ గిల్‌ (79) ఆకట్టుకున్నారు. 41వ ఓవర్ లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్‌ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3 వికెట్లు పడగొట్టినా 100 పరుగులు సమర్పించుకున్నాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లను భారత బౌలర్ షమీ ఓ ఆటాడుకున్నాడు. 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఆరంభంలోనే షమీ డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. డెవాన్‌ కాన్వే (13), రచిన్‌ రవీంద్ర (13) లను పెవిలియన్‌ కు పంపాడు. 30 పరుగులకే ఆ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ విలియమ్సన్‌ (69), మిచెల్‌ (134) లు కివీస్‌ ను ఆదుకున్నారు. వీళ్లిద్దర్ని కూడా షమీ ఔట్ చేశాడు. ఫిలిప్స్ (41) ఫర్వాలేదనిపించినా.. బుమ్రా ఔట్ చేయడంతో కివీస్ కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. 327 పరుగులకే ఆ టీమ్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయం ఖాయమైంది.

ఈ విజయంతో వరల్డ్ కప్‌ ఫైనల్‌ లో ప్రవేశించింది టీమిండియా. అలాగే, నాలుగేండ్ల నాటి పగ కూడా చల్లారింది. భారత క్రికెట్‌ అభిమానులను ఇప్పటికీ వేధించే 2019 వరల్డ్ కప్‌ సెమీస్‌ ఓటమికి ఇప్పటికి బదులు తీర్చుకున్నట్టయింది. గురువారం కోల్‌ కతా వేదికగా సౌతాఫ్రికా, ఆసీస్‌ మధ్య జరుగబోయే మ్యాచ్‌ విజేతతో ఈనెల 19న తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. భారత్ మెగాటోర్నీ హిస్టరీలో నాలుగోసారి ఫైనల్​ కు చేరింది.

You may also like

Leave a Comment