రాణి వీర దుర్గావతి దేవి (Rani Veera Durgavati Devi)… బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత. బ్రిటీష్ అధికారి శాండర్స్ (Shanders) ను హత్య చేసిన భగత్ సింగ్, రాజ్ గురులను తప్పించడంలో కీలక పాత్ర పోషించిన ధీర మహిళ. జైలు నుంచి భగత్ సింగ్, రాజ్ గురులను విడిపించేందుకు తన ఆభరణాలను మొత్తం అమ్మిన గొప్ప దేశ భక్తురాలు. బ్రిటీష్ అధికారి హేళీ ని హత మార్చేందుకు ప్రయత్నించిన విప్లవ కెరటం.
1907 అక్టోబరు 7న యూపీలోని అలహాబాద్ లో వీర దుర్గాబాయి జన్మించారు. భగవతి చరణ్ వోహ్రాతో ఆమెకు వివాహం జరిగింది. ‘నవ జవాన్ భారత్ సభ’లో సభ్యురాలిగా చేరారు. అనంతరం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. శాండర్స్ హత్య అనంతరం భగత్ సింగ్, రాజ్ గురులను తప్పించడంలో కీలక పాత్ర పోషించారు. సుఖ్ దేవ్ విజ్ఞప్తి మేరకు భగత్ సింగ్ భార్యగా నటించారు.
రాణి వీర దుర్గావతి దేవీ భర్తగా మారు వేషంలో భగత్ సింగ్, వాళ్ల సామాన్లు మోసే కూలీగా సుఖదేవ్ లను లక్నోకు పంపించారు. ఆ తర్వాత శాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు శిక్ష పడింది. దీంతో తన ఆభరణాలు అమ్మి వచ్చిన సొమ్ముతో వారిని జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు. లాహోర్ జైలులో 63 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన పోరాట యోధుడు ‘జతిన్ దాస్’ అంతిమ యాత్రను కోల్ కతా వరకు నిర్వహించారు.
1929లో కేంద్ర అసెంబ్లీపై భగత్ సింగ్ దాడి చేసిన అనంతరం ఆంగ్లేయ అధికారి లార్డ్ హేళీ ని హత మార్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడి 3 నెలలు జైలు శిక్ష అనుభవించారు. తన భర్తతో కలిసి హెచ్ఆర్ఏ సభ్యులకు సహకరించారు. ‘హిమాలయన్ టాయిలెట్స్’ పేరిట బాంబుల ఫ్యాక్టరీని నడపడంలో హెచ్ఆర్ఏ సభ్యుడు విమల్ ప్రసాద్ జైన్ కు సహకరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సాధారణ జీవితం గడిపారు వీర దుర్గావతి దేవి. అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి పేదలకు ఉచిత విద్య అందించారు.