Telugu News » World Cup 2023 : ఫైనల్ కు భారత్.. కివీస్ పై ప్రతీకారం!

World Cup 2023 : ఫైనల్ కు భారత్.. కివీస్ పై ప్రతీకారం!

41వ ఓవర్ లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్‌ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3 వికెట్లు పడగొట్టినా 100 పరుగులు సమర్పించుకున్నాడు.

by admin
India won by 70 runs

– ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
– సెమీస్ లో న్యూజిలాండ్ పై భారీ విజయం
– సెంచరీలతో చెలరేగిన కోహ్లి, అయ్యర్
– 7 వికెట్లు పడగొట్టి కివీస్ ను చిత్తు చేసిన షమీ
– మ్యాచ్ లో అరుదైన రికార్డులు

ఈసారి ప్రపంచకప్ (World Cup) లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మొదటి మ్యాచ్ నుంచి ఓటమే లేకుండా ఫైనల్ కు చేరుకున్నారు. సెమీస్ ఫైట్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది రోహిత్ సేన. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కోహ్లి, అయ్యర్ సెంచరీలతో దుమ్మురేపగా.. 7 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు మహ్మద్ షమీ.

India won by 70 runs

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్ (105) సెంచరీలతో చెలరేగారు. ఓపెనర్లు రోహిత్ (47), శుభ్‌ మన్‌ గిల్‌ (79) ఆకట్టుకున్నారు. 41వ ఓవర్ లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్‌ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3 వికెట్లు పడగొట్టినా 100 పరుగులు సమర్పించుకున్నాడు.

India won by 70 runs 1

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లను భారత బౌలర్ షమీ ఓ ఆటాడుకున్నాడు. 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి.. 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ఇటు, మెగాటోర్నీ హిస్టరీలో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు. మొత్తం 17 ఇన్నింగ్స్‌ లలోనే ఈ ఫీట్‌ ను అందుకుని ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

ఆరంభంలోనే షమీ డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. డెవాన్‌ కాన్వే (13), రచిన్‌ రవీంద్ర (13) లను పెవిలియన్‌ కు పంపాడు. 30 పరుగులకే ఆ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ విలియమ్సన్‌ (69), మిచెల్‌ (134) లు కివీస్‌ ను ఆదుకున్నారు. వీళ్లిద్దర్ని కూడా షమీ ఔట్ చేశాడు. ఫిలిప్స్ (41) ఫర్వాలేదనిపించినా.. బుమ్రా ఔట్ చేయడంతో కివీస్ కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. 327 పరుగులకే ఆ టీమ్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయం ఖాయమైంది.

ఈ విజయంతో వరల్డ్ కప్‌ ఫైనల్‌ లో ప్రవేశించింది టీమిండియా. అలాగే, నాలుగేండ్ల నాటి పగ కూడా చల్లారింది. భారత క్రికెట్‌ అభిమానులను ఇప్పటికీ వేధించే 2019 వరల్డ్ కప్‌ సెమీస్‌ ఓటమికి ఇప్పటికి బదులు తీర్చుకున్నట్టయింది. గురువారం కోల్‌ కతా వేదికగా సౌతాఫ్రికా, ఆసీస్‌ మధ్య జరుగబోయే మ్యాచ్‌ విజేతతో ఈనెల 19న తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. భారత్ మెగాటోర్నీ హిస్టరీలో నాలుగోసారి ఫైనల్​ కు చేరింది.

You may also like

Leave a Comment