75 ఏండ్ల స్వతంత్ర భారతం ఇప్పుడిప్పుడు అభివృద్ధి (Development) ఫలాలను అందుకుంటోంది. ఈ అభివృద్ధికి కారణం మేమంటే మేమని అటు కాంగ్రెస్ (Congress), ఇటు బీజేపీ (BJP)లు తన్నుకుంటున్నాయి. అభివృద్ధి క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్థిక నివేదికలు బయటకు వస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఎవరి సత్తా ఏంటో ఆ నివేదికలు చెబుతున్నాయి.
భారత్ విశ్వ గురువుగా ఎదుగుతోంది. పాండమిక్ సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచ దేశాలకు పెద్దన్నలాగా నిలిచింది. 1991లో ఆర్థిక సరళీకరణలు మొదలైన తర్వాత దేశం అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఇదే ఊపు కొనసాగితే త్వరలోనే ప్రపంచంలో అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే అవకాశం ఉంది.
అభివృద్ధి అనేది కేవలం ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. దాని వెనుక కొన్ని దశాబ్దాల ప్రణాళికలు, ఏండ్ల తరబడి ప్రభుత్వాల కఠోరమైన శ్రమ ఉంటుంది. దేశంలో ప్రణాళిక సంఘం మొదలు నీతి అయోగ్ వరకు ఎన్నో ప్రణాళికలు, ఎన్నో అభివృద్ధి నమూనాలను రూపొందించి అమలు చేశాయి. వాటన్నిటి ఫలితమే మనం నేడు చూస్తున్న అభివృద్ధి.
దేశంలో అభివృద్ధి ప్రక్రియను మొదలు పెట్టింది కాంగ్రెస్ అయితే దాన్ని ప్రస్తుతం పరుగులు పెట్టిస్తోంది మాత్రం బీజేపీ అనేది నిర్వివాదమైన అంశం. ఇది ఇలా వుంటే అటు మన్మోహన్ సింగ్, ఇటు మోడీల్లో ఎవరి పాలనలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందిందనే అంశంపై చర్చ నడుస్తోంది. దీంతో ఎవరు బెస్ట్ అనే విషయంపై గణాంకాల ఆధారంగా ఓ నిర్ణయానికి రావాలని నిపుణులు అంటున్నారు.
2014 వరకు భారత్‌లో అభివృద్ధి కాస్త నెమ్మదిగా ఉండగా, 2023 నుంచి అభివృద్ధి ఊపందుకుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఇక 2014లో జీడీపీ 98 లక్షల కోట్లు ఉండగా, 2023 వరకు 159.7 లక్షల కోట్లుగా ఉంది. 2014లో భారత ప్రభుత్వ వ్యయం రూ. 3.92 లక్షల కోట్లు ఉండగా, 2023 వరకు అది 10.3 లక్షల కోట్లకు పెరిగింది. 2014లో వ్యవసాయ బడ్జెట్ 21,900 కోట్లు, 2023లో 1.25 లక్షల కోట్లకు చేరింది.
విదేశీ మారక నిల్వలు 2014లో 313 బిలియన్ డాలర్లు ఉండగా, 2023లో అది 600 మిలియన్ డాలర్లకు చేరుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 45 బిలియన్ డాలర్ల నుంచి 84.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. తలసరి ఆదాయం 86454 నుంచి 1.50 లక్షలకు పెరిగింది. పేదరికం 2014లో 22 శాతం ఉండగా, 2023 నాటికి 10 శాతానికి గణనీయంగా తగ్గింది.
ఇక రక్షణ రంగ ఎగుమతులు 1941 కోట్ల నుంచి 16,000 కోట్లు అయింది. 2014లో ప్రపంచ ఎకానమీలో భారత్ 10వ స్థానంలో ఉండగా 2023 నాటికి ఐదవ స్ఠానానికి చేరుకుని ఒక బలమైన ఆర్థిక శక్తిగా అవతరించింది. నల్లా కనెక్షన్లు 3.2 కోట్ల నుంచి 12.7 కోట్లకు పెరిగింది. ఇక ఎయిర్ పోర్టు సంఖ్య 74 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయింది.
ఇక జాతీయ రహదారులు 91,287 కిలీ మీటర్లు ఉండగా, 1,45, 155గా ఉంది. రైల్వే నూతన లైన్లు 1520 నుంచి 2625కు చేరింది. ఆహార ఉత్పత్తిలో 265 మిలియన్ టన్నుల నుంచి 323.55 మిలియన్ టన్నులుకు చేరి సంవృద్ధిని సాధించింది. పప్పుల ఉత్పత్తిలో 1.2 మిలియన్ టన్నుల నుంచి 82.21 మిలియన్ టన్నులకు గణనీయంగా పెరిగింది.
ఇక దేశంలో వర్శిటీల సంఖ్య 713 నుంచి 1113కు, కాలేజీల సంఖ్య 38498 నుంచి 43796కు, మెడికల్ కాలేజీలు 700 నుంచి 1341, నిర్మించిన పాఠశాలల సంఖ్య 6,37,000 నుంచి 6,53,000, జన ఔషధి కేంద్రాల సంఖ్య 80 నుంచి 9484, ఏయిమ్స్ సంఖ్య 7 నుంచి 23కు పెరిగింది. ఎవరి వల్ల వేగంగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని పక్కకు పెడితే దేశం అభివృద్ధి చెందడం అనేది ప్రతి భారతీయుడు గర్వపడే విషయం.