Telugu News » ‘కంగారు’పెట్టించారు… కప్ పట్టుకు పోయారు….!

‘కంగారు’పెట్టించారు… కప్ పట్టుకు పోయారు….!

50 ఓవర్లలో 240 పరుగులకు టీమ్ ఇండియా ఆలౌట్ అయింది. భారత విసిరిన 241పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ జట్టు 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 241 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకుంది.

by Ramu
australia won the world cup

– నిరాశ పరిచిన రోహిత్ సేన
– ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ లో తడబాటు
– తక్కువ స్కోర్ కే పరిమితం
– సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్
– 137 రన్స్ తో చెలరేగిన ట్రావిస్ హెడ్
– ఆరోసారి విశ్వ విజేతగా ఆసీస్
– కోహ్లి, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు

భయపడ్డట్టే జరిగింది. వరల్డ్ కప్ ఫైనల్‌ లో భారత ఆటగాళ్లు తడబడ్డారు. ఆస్ట్రేలియాతో తుది పోరులో టీమిండియా ఆటగాళ్లు నిరాశ పరిచారు. 50 ఓవర్లలో 240 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ జట్టు 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్‌ ను అందుకుంది.

241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కంగారుల జట్టుకు ఆదిలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 7 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ 15 పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (4) ను కూడా బుమ్రా ఎల్బీడబ్య్లూగా పెవీలియన్ కు పంపాడు. దీంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో మరో ఓపెనర్ ట్రావెస్ హెడ్ ఆచితూచి ఆడాడు. లబుషెంగేతో కలిసి నెమ్మదిగా పరుగులు రాబట్టాడు. అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. చివరకు ట్రావెస్ హెడ్ 137 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో శుభమన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. లబుషెంగే 58 పరుగులతో నాటౌట్ గా, మ్యాక్స్ వెల్ 2 నాటౌట్‌ గా నిలిచారు. దీంతో 43 ఓవర్లలో ఆస్ట్రేలియా విజయ లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకు ముందు, బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. సిక్సులు, ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో మరో ఓపెనర్ శుభమన్ గిల్ 4 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌ లో జంపాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 47 పరుగులతో మంచి జోరు మీద ఉన్న రోహిత్ శర్మ మ్యాక్ వెల్ బౌలింగ్ లో హెడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కేవలం 4 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్‌ లో జోష్ ఇంగ్లీష్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

మరోవైపు, కోహ్లి ఆచితూచి ఆడుతూ 54 పరుగులు చేశాడు. కమ్మిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ 66 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌ లో జోష్ ఇంగ్లీష్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. దీంతో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ చిన్న లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా చేరుకుంది. దీంతో 2003 మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకుంటారని అనుకున్న క్రికెట్ అభిమానుల కల నెరవేరలేదు. అలాగే మిగిలిపోయింది.

You may also like

Leave a Comment