Telugu News » Ayodhya : అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఖరారు….!

Ayodhya : అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఖరారు….!

వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ‘రామ్ లల్లా’ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.

by Ramu

అయోధ్య (Ayodhya) రామ మందిరంలో ‘రామ్ లల్లా’ (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ‘రామ్ లల్లా’ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. మృగశిర నక్షత్రం అభిజిత్ ముహూర్తంలో ప్రధాని మంత్రి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు నిర్ణయించారు.

 

సాకేత్ నిలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. అయోధ్య ఆలయానికి సంబంధించి తొలి విడత ప్రచారాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. వచ్చే నెల 20 వరకు ఈ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూస్తామని వీహెచ్ పీ నేతలు వెల్లడించారు.

జిల్లా, బ్లాక్ స్థాయి కమిటీలో అయోధ్య రామ మందిర ఉద్యమానికి సంబంధించిన కరసేవకులు కూడా ఉన్నారు. ఈ కమిటీలు మొత్తం 250 ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నాయి. వీలైనంత ఎక్కువ మంది ఆలయ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేలా ఈ కమిటీలు చూస్తాయని వీహెచ్ పీ నేతలు పేర్కొన్నారు. ఇక రెండవ దశ ప్రచారాన్ని జనవరి 1 నుంచి ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి రామ్ లల్లా చిత్ర పటాన్ని, కరపత్రాలను అందించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవరం రోజు దీపోత్సవం జరుపుకోవాలని ఈ దశలో ప్రచారం చేయనున్నారు. ఇక మూడవ దశ ప్రచారాన్ని జనవరి 26 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించనున్నారు. అవధ్ ప్రావిన్స్ లోని కార్మికులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1 తేదీల్లో దర్శనం కల్పించాలని యోచిస్తున్నారు.

You may also like

Leave a Comment