Telugu News » Amit Shah : అవినీతిలో కేసీఆర్‌ పాలన అగ్రస్థానం.. నిప్పులు చెరిగిన అమిత్ షా

Amit Shah : అవినీతిలో కేసీఆర్‌ పాలన అగ్రస్థానం.. నిప్పులు చెరిగిన అమిత్ షా

పటేల్ కృషితో రజాకార్ల నుంచి రాష్ట్రం విముక్తి పొందిందన్నారు అమిత్‌ షా. ఒవైసీకి భయపడి కేసీఆర్‌ విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఫైరయ్యారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు.

by admin
Amit Shah Speech in Public Meeting at Jangoan

– దళితులకు మూడెకరాలు ఏమైంది?
– దళిత సీఎం హామీ ఏమైంది?
– నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదు?
– కేసీఆర్ ను ప్రశ్నించిన అమిత్ షా
– బీజేపీని గెలిపిస్తే బీసీ సీఎం అవుతారని స్పష్టం
– కుటుంబ పార్టీలను నమ్మొద్దు
– ఎవరు అవినీతికి పాల్పడినా జైలుకు ఖాయం
– ఒవైసీకి భయపడే విమోచన దినోత్సవం జరపడం లేదు
– ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాల్సిందే
– జనగామలో షా విమర్శల దాడి

తెలంగాణ (Telangana) లో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవిగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah). జనగామ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీలు బీసీలకు అన్యాయం చేశాయని ఆరోపించారు. బీజేపీ (BJP) కి అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న మాట ఏమైందని కేసీఆర్‌ (KCR) ను ప్రశ్నించారు. అలాగే, దళితుడ్ని సీఎం చేస్తానని మాట తప్పారని మండిపడ్డారు.

Amit Shah Speech in Public Meeting at Jangoan

పటేల్ కృషితో రజాకార్ల నుంచి రాష్ట్రం విముక్తి పొందిందన్నారు అమిత్‌ షా. ఒవైసీకి భయపడి కేసీఆర్‌ విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఫైరయ్యారు. బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. అలాగే, భైరాన్‌ పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్థూపం నిర్మిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. జనగామ ఎమ్మెల్యే భూ కుంభకోణాల్లో ఉన్నారని, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అన్నీ కుటుంబ పార్టీలేనని విమర్శలు గుప్పించారు షా. 2జీ పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్, 3జీ అంటే ఎంఐఎం, 4జీ అంటే 4 తరాల నెహ్రూ, ఇందిరా, రాజీవ్, రాహుల్ పార్టీ అని ఎద్దేవ చేశారు. కానీ, బీజేపీ అంటే ప్రజల పార్టీ అని తెలిపారు. కాళేశ్వరం కుణకోణం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొత్తం కుంభకోణాల మయమని విమర్శలు చేశారు. అవినీతిలో కేసీఆర్‌ పాలన అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు.

మోడీ హయాంలో దేశం ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్న అమిత్‌ షా.. కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ను ముమ్మాటికీ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని.. ఫసల్ భీమా అమలు చేస్తామని చెప్పారు. పేదలకు వైద్య సాయం కోసం 10 లక్షల వరకు తమ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు అమిత్ షా.

You may also like

Leave a Comment