Telugu News » Telangana : బడా… కేసులంటే.. ఎందుకింత తేడా!?

Telangana : బడా… కేసులంటే.. ఎందుకింత తేడా!?

వీళ్లే కాదు ఇంకా కొందరు అధికారులు సైలెంట్ గా అన్నీ కానిచ్చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఉన్నతాధికారులు తప్పు చేసినా.. చర్యలు తీసుకోవడం ఆలస్యమే అవుతుందని కిందిస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.

by admin

– ఉన్నతాధికారుల కేసులు తేలేదెప్పుడు?
– రజత్ కుమార్ పై అనేక ఆరోపణలు
– కుమార్తె పెళ్లి ఖర్చుపై అప్పట్లో రచ్చ
– 8 ఏళ్లుగా తేలని స్మితా సబర్వాల్ నిధుల కేసు
– 12 ఏళ్లుగా నానుతున్న నవీన్ మిట్టల్ పై ఆరోపణల కేసులు
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

ప్రభుత్వంలోని అధికారులకు ట్రాన్ఫర్లు సహజమే. కిందిస్థాయి వాళ్ల నుంచి పై స్థాయి వారి దాకా తరచూ అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు బదిలీలపై తిరుగుతుంటారు. కానీ, కొందరు మాత్రం ఒకే చోట తిష్ట వేసి ఉంటారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెబుతుంటారు మేధావులు. ఒకటి ప్రభుత్వ పెద్దల అండదండలు.. ఇంకొకటి విచ్చలవిడిగా దండుకుంటున్న పైసలు. వ్యవస్థను మేనేజ్ చేస్తూ కొందరు అధికారులు ఎన్ని తప్పులు చేసినా చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయని అంటున్నారు. ఏదో కిందిస్థాయి ఉద్యోగి చిన్న తప్పు చేస్తే.. వెంటనే శిక్షలు వేస్తుంటారు ఉన్నతాధికారులు. అదే.. పైస్థాయిలో ఉన్న వాళ్లు చేసిన తప్పులు బయటపడినా.. అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారని.. దానివల్ల ఏళ్ల తరబడి బాధితులకు అన్యాయం జరుగుతోందని చెబుతున్నారు.

ias-officers-court-cases-delay

ఇరిగేషన్ శాఖలో కీలక అధికారిగా ఉన్న రజత్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ కు మేలు చేసేలా చేశారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈక్రమంలోనే 30 ఎకరాలు సంపాదించారని వార్తలు కూడా వచ్చాయి. వీటిపై ఆయన హర్టయి సీసీఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక, తన కుమార్తె పెళ్లికి చేసిన భారీ ఏర్పాట్ల ఖర్చును మేఘా సంస్థ చెల్లించిందనే ఆరోపణలు వినిపించాయి. గతంలో ఈ విషయం పెద్ద రచ్చకు దారి తీసింది. ఏకంగా పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపై అనుమానాలకు తావిచ్చింది. ఈ అవినీతి మరకలపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణ కూడా జరుగుతోంది. ఈయన రిటైర్మెంట్ ఈనెల 30న ఉండగా.. కేసు విచారణ మాత్రం వచ్చే నెల 12 జరగనుంది. దీంతో బ్యూరోక్రాట్స్ పై విచారణ అలస్యం అనేది అనవాయితీగా వస్తోందనే విమర్శలు వస్తున్నాయి. రజత్ కుమార్ పై ఇప్పటి వరకు 83 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలా వరకు క్షమాపణ కోరడంతో రద్దు చేశారని సమాచారం.

ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ అప్పుడప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు స్మితా సబర్వాల్. తెలంగాణలో ఎన్ని ఘోరాలు జరిగినా ఈమె నోరెత్తరని.. బీఆర్ఎస్ కు వంత పాడుతుంటారని ప్రతిపక్షాలు ఆయా సమయాల్లో తిట్టిపోస్తుంటాయి. అయితే.. ఈమెకు సంబంధించిన ఓ కేసు కోర్టులో నలుగుతోంది. 2015లో డిజైనర్ అభిషేక్ దుత్తా ఆధ్వర్యంలో ఓ ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో స్మితా సబర్వాల్ తన భర్తతో కలిసి పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోలను అవుట్ లుక్ మ్యాగజైన్ ప్రచురించింది. ఓ వ్యాసాన్ని రాస్తూ.. దానికి ‘నో బోరింగ్ బాబు’ అంటూ క్యారికేచర్ తో పాటుగా ప్రింట్ చేసింది. దీనిపై స్మితా సబర్వాల్ మండిపడ్డారు. తన పరువుకు నష్టం కలిగించేలా ప్రచురించారని.. రూ.10 కోట్ల పరువు నష్టం కేసు వేసేందుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె అడిగిన వెంటనే స్పందించి.. ఫీజు, ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలను విడుదల చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయంపై హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ ఏళ్ల తరబడి సాగుతోంది. గతంలో అది ప్రజా ధనమని.. ప్రభుత్వానికి రూ.15 లక్షలను స్మితా సబర్వాల్ తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం 2022లో సుప్రీంకోర్టుకి అప్పిల్ కి వెళ్లింది. ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ వాదనలు వినిపించలేదు. ఈనెల 3న విచారణకు రాగా.. పిటిషనర్ ఇంకా సమయం కావాలని కోరడంతో 2 వారాల కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చిచెప్పింది ధర్మాసనం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008 నుంచి 2010 వరకు హైదరాబాద్ కలెక్టర్ గా నవీన్ మిట్టల్ పని చేశారు. ఈయన కాలంలో ప్రభుత్వ భూములు ఎన్నో అన్యాక్రాంతం అయ్యాయని నటరాజ్ గుల్జార్ నివేదకతో తేలింది. గుడిమల్కాపూర్ లోని 5,600 గజాల స్థలాన్ని శాంతి అగర్వాల్ వేలంపాటలో తీసుకుంది. కానీ, నవీన్ మిట్టల్ మాత్రం వేరే వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. 2010లో ఈ కేసు సంచలనం రేపింది. 80 ఏండ్ల మహిళ తన భూమి కోసం ఫైటింగ్ కొనసాగించింది. దీంతో పాటు సనత్ నగర్ లో 4 వేల గజాలు.. బతుకమ్మ కుంటలో 10 వేల గజాల భూమిలో అక్రమాలు జరిగాయని తేలింది. ఆ రోజుల్లోనే 30 కోట్ల భూ అక్రమాల్లో నవీన్ మిట్టల్ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. రిట్ పిటిషన్ 766 /2011 హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. 2017లో జస్టిస్ రామచంద్రరావు ఈ కేసుల్లో నవీన్ మిట్టల్ తీరును తప్పుబడుతూ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై ఆయన రిట్ అప్పీల్ 686/2017 కు వెళ్లారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో శాంతి అగర్వాల్ కంటెప్ట్ కేసు వేయగా హైకోర్టులో విచారణలో ఉన్నందున క్రిమినల్ కేసుపై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. 2017 నుంచి ఇప్పటి వరకు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం నవీన్ మిట్టల్ సీసీఎల్ఏ కమిషనర్ గా ఉన్నారు. ధరణితో పాటు అనేక భూములు ఈయన చెప్పుచేతుల్లోనే ఉన్నాయి. దీంతో గత కేసుల నేపథ్యంలో ఎన్ని వేల కోట్ల భూములకు రెక్కలు వచ్చాయో అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నవీన్ మిట్టల్ పై ఇప్పటి వరకు 74 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. వీళ్లే కాదు ఇంకా కొందరు అధికారులు సైలెంట్ గా అన్నీ కానిచ్చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఉన్నతాధికారులు తప్పు చేసినా.. చర్యలు తీసుకోవడం ఆలస్యమే అవుతుందని కిందిస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.

You may also like

Leave a Comment