ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) మిలిటెంట్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ (Cease Fire) ఒప్పందం అమలులోకి వచ్చింది. ఖతర్ (Kathar) మధ్య వర్తిత్వంతో ఈ ఒప్పందం అమలుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
ఒప్పందం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్దం తాత్కాలికంగా నిలిచి పోయింది. ఇక బందీలను ఇరు దేశాలు విడతల వారీగా విడుదల చేయనున్నాయి. మొదటి విడతలో 13 మంది బంధీలను హమాస్ విడుదల చేయనున్నట్టు ఖతర్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు బందీలను హమాస్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది.
ఒప్పందంలో భాగంగా 50 మంది బందీలను విడతల వారీగా హమాస్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. అదే సమయంలో ఇటు ఇజ్రాయెల్ కూడా 150 మంది బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకుంది. ఇప్పటికే 300 మంది బందీల జాబితాను ఇజ్రాయెల్ విడుదల చేసింది. మొదటి విడతలో విడుదలయ్యే బందీల పేర్లను అటు హమాస్ కూడా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో బందీల కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇటు ఇజ్రాయెల్ కూడా మొదటి విడతలో కొంత మంది బందీలను విడుదల చేయనున్నట్టు ఖతర్ విదేశాంగ చెప్పింది. అయితే మొదటి విడతలో ఎంత మందిని విడుదల చేస్తారనే విషయంపై ఖతర్ స్పష్టత ఇవ్వలేదు.