Telugu News » CM Jagan : జగన్ కు వరుస షాకులు.. ఏం జరగబోతోంది..?

CM Jagan : జగన్ కు వరుస షాకులు.. ఏం జరగబోతోంది..?

కాంగ్రెస్ హయాంలో పెట్టిన కేసుల్లో జగన్ బెయిల్ పొంది ఏళ్లు గడుస్తున్నాయని.. దీన్ని రద్దు చేయాలని సుప్రీంలో రఘురామ పిటిషన్ వేశారు. ముందు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన.

by admin
Supreme Court BIG Shock to jagan

– సుప్రీంకోర్టులో జగన్ కు షాక్
– బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ
– జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు
– వెంటనే బెయిల్ రద్దు చేయాలా? అని వ్యాఖ్యానించిన సుప్రీం
– ఇప్పటికే ఏపీ హైకోర్టు నుంచి నోటీసులు
– ఆర్థిక అవకతవకలపై వివరణ అడిగిన న్యాయస్థానం
– కీలక సమయంలో వరుస నోటీసులతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్

వైసీపీ (YCP) నుంచి గెలిచి ఆపార్టీకే పెద్ద తలనొప్పిగా తయారయ్యారు రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju). రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు, జగన్ (CM Jagan) బెయిల్ రద్దు అంటూ న్యాయస్థానాల్లో ఆయన వేసిన పిటిషన్లపై కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఏపీ హైకోర్టు (Ap High Court) సీఎం జగన్ కు నోటీసులు ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని హైకోర్టులో రఘురామ గతంలో పిటిషన్ దాఖలు చేయగా.. జగన్‌ తోపాటు 41 మందికి నోటీసులు వెళ్లాయి. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది న్యాయస్థానం. దీనిపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) కూడా జగన్ కు షాకిచ్చింది.

Supreme Court BIG Shock to jagan

కాంగ్రెస్ హయాంలో పెట్టిన కేసుల్లో జగన్ బెయిల్ పొంది ఏళ్లు గడుస్తున్నాయని.. దీన్ని రద్దు చేయాలని సుప్రీంలో రఘురామ పిటిషన్ వేశారు. ముందు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన. అయితే.. సీబీఐ నుంచి సరైన రిప్లై లేకపోవడంతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ ను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని కూడా ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇటు, ఇప్పటికే హైదరాబాద్ లో వేసిన పిటిషన్ ను ఢిల్లీకి మార్చాలని రఘురామ కోరారు. దీంతో ఇదే పిటిషన్‌ కు జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

అటు ఏపీ హైకోర్టులో, ఇటు సుప్రీంలో జగన్ కు వరుస షాకులు తగలడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు అయితే పరిస్థితి ఏంటనే దానిపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

You may also like

Leave a Comment