Telugu News » PM Modi : హామీ ఇస్తే.. అమలు చేస్తామంతే..!

PM Modi : హామీ ఇస్తే.. అమలు చేస్తామంతే..!

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్న మోడీ.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ బీసీల కోసం ఏం చేయలేదని ఆరోపించారు.

by admin
Prime Minister Narendra Modi addresses a public meeting in Kamareddy

– నిరాశలో కేసీఆర్, రేవంత్
– ఇద్దరికీ ఒకేసారి కామారెడ్డి వాసులు బుద్ధి చొప్పొచ్చు
– టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్‌ గా మారింది
– యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారింది
– పేరు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి బుద్ధి మారదు
– డబ్బు కావాలంటే ప్రాజెక్టులు కట్టడమేనా?
– బీఆర్ఎస్ అవినీతికి హద్దుల్లేవా?
– కామారెడ్డిలో నిలదీసిన ప్రధాని మోడీ

ప్రజాధనం అంతా కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందన్నారు ప్రధాని మోడీ (PM Modi). తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కామారెడ్డి (Kamareddy) లో ఏర్పాటు చేసిన బీజేపీ (BJP) సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీతో యువత మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy), కేసీఆర్‌ (KCR) నిరాశా నిస్పృహల్లో ఉన్నారని సెటైర్లు వేశారు. అందుకే, రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని ప్రజలను కోరారు.

Prime Minister Narendra Modi addresses a public meeting in Kamareddy

హామీ ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. ఇప్పటిదాకా ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు. టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్‌ గా మారిందని, యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని విమర్శించారు. పేరు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి బుద్ధి మారదని ఎద్దేవ చేశారు. మాదిగల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ నేతలకు డబ్బు కావాలంటే కొత్తగా ప్రాజెక్టులు నిర్మిస్తారని.. రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు జమ చేశామన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా 40 లక్షల మంది తెలంగాణ రైతులు లబ్ధి పొందారని అన్నారు మోడీ. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ప్రజలు కేసీఆర్ నుంచి విముక్తి కోరుతున్నారని చెప్పారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్న మోడీ.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ బీసీల కోసం ఏం చేయలేదని ఆరోపించారు. కానీ, బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని.. అలాగే రాష్ట్రానికి ఇచ్చిన పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ హామీలను నెరవేర్చిందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అత్యధికంగా పదవులను ఇచ్చామని వివరించారు ప్రధాని మోడీ.

కొల్లాపూర్ లో అమిత్ షా హామీల వర్షం

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షా కొల్లాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా హామీల వర్షం కురిపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. వాల్మీకి, బోయ, మాదాసి, కురువ, కులాలకు న్యాయం చేస్తామన్నారు. శ్రీశైలం నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. తాము అందరికి పరిహారం, భూమి అందజేస్తామని తెలిపారు. గుండు మల్ల ప్రాజెక్టుకు వెంటనే పూర్తి చేస్తామని.. మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అనేక కుంభకోణాలకు పాల్పడిందని.. కేసీఆర్ తెలంగాణలో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు అమిత్ షా.

You may also like

Leave a Comment