Telugu News » Hamas: రెండవ బ్యాచ్‌లో 13 మంది ఖైదీలు విడుదల…!

Hamas: రెండవ బ్యాచ్‌లో 13 మంది ఖైదీలు విడుదల…!

13 మంది ఇజ్రాయెల్, నలుగురు థాయ్‌లాండ్ పౌరులను హమాస్ విడుదల చేసినట్టు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి.

by Ramu

ఇజ్రాయెల్‌ (Israel)తో ఒప్పందంలో భాగంగా రెండవ బ్యాచ్ ఖైదీలను హమాస్ (Hamas) విడుదల చేసింది. 13 మంది ఇజ్రాయెల్, నలుగురు థాయ్‌లాండ్ పౌరులను హమాస్ విడుదల చేసినట్టు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. సంధి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఖైదీల విడుదల విషయంలో జాప్యం జరిగింది.

ఈ క్రమంలో ఖైదీల విడుదల ఉంటుందా లేదా అనే భయాలు నెలకొన్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఖైదీలను విడుదల చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 13 మంది పౌరులు ఇజ్రాయెల్ చేరుకుంటున్నట్టు ఆ దేశ సైన్యం వెల్లడించింది. వారందరికీ మొదట వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు చెప్పింది.

గాజా నుంచి విడుదలైన తర్వాత ఖైదీలు ఈజిఫ్టులోని రఫా సరిహద్దులు దాటుతుండగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బందీలను హమాస్ శనివారం ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC)కి అప్పగించింది. విడుదలైన 13 మంది ఇజ్రాయిల్ పౌరుల్లో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, యువకులు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

మరోవైపు ఇటు ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అందులో 33 మంది మైనర్లు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. అంతకు ముందు మొదటి బ్యాచ్‌లో 13 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. వారిలో పది మంది థాయ్‌లాండ్, పిలిప్పీన్స్ పౌరులు ఉన్నారు.

You may also like

Leave a Comment