Telugu News » Rahul Gandhi : కేసీఆర్ అవినీతి కనిపించడం లేదా?

Rahul Gandhi : కేసీఆర్ అవినీతి కనిపించడం లేదా?

కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని.. కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోడీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.

by admin
Rahul Gandhi Andole Public Meeting

– నాపై 24 కేసులు పెట్టారు
– కేసీఆర్ అవినీతిపరుడని తెలిసినా ఒక్క కేసు లేదు
– ప్రధాని మోడీని నిలదీసిన రాహుల్ గాంధీ
– బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శ
– తెలంగాణ ఆదాయాన్ని కేసీఆర్ దోచేశారు
– ఆయనకు కుటుంబంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు
– కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు పక్కా
– అంధోల్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ (BRS) ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). సంగారెడ్డి జిల్లాలోని అంధోల్​ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ధరణి (Dharani) పోర్టల్‌ ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములను కేసీఆర్ (KCR) గుంజుకున్నారని విమర్శించారు. తెలంగాణ (Telangana) కు కాంగ్రెస్ (Congress) ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని.. ఆయన చదువుకున్న స్కూళ్లు, కాలేజీలు తాము కట్టినవేనని తెలిపారు.

Rahul Gandhi Andole Public Meeting

తెలంగాణ ఆదాయాన్ని కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ల్యాండ్‌, మైన్స్‌, సాండ్‌, వైన్స్‌ అన్నీ కల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న రాహుల్‌.. కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆయన దోపిడీ వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల సర్కార్‌ కు, ప్రజల ప్రభుత్వానికి మధ్య జరుగుతోన్న పోరాటమన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు రాహుల్. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.15 వేల భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. అన్నదాతలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న ఆయన.. మహిళలకు రూ.500కు గ్యాస్‌ సిలిండర్ ఇచ్చి ఊరట కల్పిస్తామన్నారు. వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 వేస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని.. కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోడీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. లోక్‌ సభలో మోడీకి కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్‌ కు మోడీ ఒకరికొకరు మద్దతిచ్చుకుంటూ ఉంటారని చెప్పారు. మోడీ తనపై 24 కేసులు పెట్టారన్న రాహుల్.. అవినీతిపరుడైన కేసీఆర్‌ పై మాత్రం ఒక్కటి కూడా పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోని కేసీఆర్‌.. కేవలం తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని విమర్శించారు రాహుల్ గాంధీ.

You may also like

Leave a Comment