Telugu News » PM Modi : లిక్కర్ స్కాంలో ఉన్న అందర్నీ జైలుకు పంపుతాం..!

PM Modi : లిక్కర్ స్కాంలో ఉన్న అందర్నీ జైలుకు పంపుతాం..!

ఓటమి భయంతోనే కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు ప్రధాని. గజ్వేల్‌ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కు భయపడే కామారెడ్డి పారిపోయారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ అసలు రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు మోడీ.

by admin

– స్కీముల పేరుతో స్కాములు
– అబద్ధపు హామీలు కేసీఆర్ నైజం
– దళితుల్ని మోసం చేశారు
– డబుల్ బెడ్రూం అంటూ పేదల్ని దగా చేశారు
– కుటుంబం తప్ప ప్రజల బాధలు పట్టవా?
– కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు నిదర్శనం
– దుబ్బాక, హుజూరాబాద్‌ లో చూసింది ట్రైలర్ మాత్రమే
– ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ
– దేశాన్ని లూటీ చేసేందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ అయింది
– లిక్కర్ కేసులో ఎవరున్నా జైలుకు పక్కా
– తూప్రాన్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

అబద్ధపు హామీలివ్వడం కేసీఆర్ (KCR) నైజమని అన్నారు ప్రధాని మోడీ (PM Modi). ఆదివారం తూప్రాన్ లో బీజేపీ (BJP) సకల జనుల విజయ సంకల్ప సభ జరిగింది. ఇందులో పాల్గొని కేసీఆర్, రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై విమర్శలు చేశారు. దళితుడ్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ మోసం చేసి.. దళిత బంధు పేరుతోనూ వంచించారని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని.. రైతులకు నీళ్లు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. స్కీముల పేరుతో అనేక స్కాములు చేశారని ఆరోపించారు.

prime-minister-narendra-modi-addresses-a-public-meeting-in-tupran

తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని చెప్పిన కేసీఆర్.. కేవలం తన కుటుంబం కోసమే కష్టపడ్డారని విమర్శించారు మోడీ. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలు ఒకటేనన్నారు. రాహుల్, కేసీఆర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీజేపీ వల్లే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ సర్కార్‌ పై రైతులతో పాటు ఆ మల్లన్న స్వామి కూడా ఆగ్రహంగా ఉన్నాడన్నారు మోడీ. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కార్బన్ కాపీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే రెండు రోగాలకు బీజేపీ మాత్రమే చికిత్స చేయగలదని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగలేదని.. కానీ, బీజేపీ మాత్రం బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. బీజేపీతోనే సౌకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్‌ లో ట్రైలర్ మాత్రమే చూశారని.. అసలు సినిమా చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓటమి భయంతోనే కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు ప్రధాని. గజ్వేల్‌ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కు భయపడే కామారెడ్డి పారిపోయారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ అసలు రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు మోడీ. కేసీఆర్‌ ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఫాంహౌస్‌ కు పరిమితం చేయాలని చెప్పారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో మాదిగలకు అన్యాయం జరిగింది.. బీజేపీ వారి బాధను అర్థం చేసుకుందని తెలిపారు. వారి కోసం పోరాటం చేస్తుందని చెప్పారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఏర్పడిందన్నారు మోడీ. కానీ, ‘‘కేసీఆర్ పాలనలో నీళ్లు ఆయనకు నిధులు సమకూర్చుకోవడానికి మార్గంగా మారాయి. నిధుల సంగతి చూస్తే.. దుబారా పెంచి ప్రజలను అప్పులపాలు చేసింది. నియామకాల విషయానికొస్తే ప్రతీ నిరుద్యోగి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. గ్రూప్-1 పరీక్షలను సరిగ్గా నిర్వహించలేని అసమర్ధ ప్రభుత్వం ఇది. కేసీఆర్ మా కొలువులు ఎక్కడ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని లూటీ చేయాలనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఢిల్లీలోని అవినీతి పార్టీతో చేతులు కలిపారు. రెండు పార్టీలు కలిసి కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు జైలులో ఉన్నారు. ఈ స్కాంలో అవినీతి బీఆర్ఎస్ నాయకులు తప్పించుకోలేరు. కొందరు ఫోన్లు మార్చి డబ్బులు చేతుల మార్చిన నాయకులు జైలుకు వెళ్లే సమయం తప్పకుండా వస్తుంది. ఇది మోడీ గ్యారెంటీ’’ అని అన్నారు ప్రధాని.

You may also like

Leave a Comment