తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలన్నీ యుద్ధ వ్యూహాల్లో తలమునకలయ్యాయి. మూడు ప్రధాన పార్టీల లక్ష్యం అధికారమే. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా చాటాలని చూస్తోంది. అయితే.. బీజేపీ ఓ అడుగు ముందుకే ఉందని రాజకీయ పండితుల నుంచి వినిపిస్తున్న మాట.
బాట సింగారం డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అడ్డుకోవడం.. ఈటల లాంటి ఉద్యమ నేతను హౌస్ అరెస్ట్ చేయడం.. వర్షంలోనూ కమలనాథులు రోడ్లపై నిరసన తెలపడం.. పార్టీకి ప్లస్ అయ్యాయని అంటున్నారు విశ్లేషకులు. ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిర్బంధాలు చూడలేదని ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శల దాడి చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీ వాదన నిజమేగా అనే చర్చ ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోందని చెబుతున్నారు.
ఇదే స్పీడ్ లో బీజేపీ నేతలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి, ఈటలతో పాటు ఇతర నేతలను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం శాలువాతో ఘనంగా సత్కరించింది.
ఇక, జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్. ఎన్నికల వరకు ఇలా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ జనంలో ఉండాలని చూస్తోంది బీజేపీ. అలాగే, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలతో సమావేశాలు, ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వీటికితోడు, అప్పుడప్పుడు బీజేపీ అగ్ర నేతలను రాష్ట్రానికి తీసుకొచ్చి.. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.